అమరావతి (వేంకటపాలెం) శ్రీ వేంకటేశ్వరసస్వామివారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం యాగశాలలో పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూలవర్తకు, ఉత్సవర్లకు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్, బలిపీఠం ధ్వజస్తంభం, పరివార దేవతలకు పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహించారు.