ఆగష్టు 28 నుండి 30 తేదీ వరకు తాళ్లపాక శ్రీ చెన్నకేశ‌వ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

 

అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశ‌వ స్వామివారి ఆలయంలో ఆగష్టు 28 నుండి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. పవిత్రోత్సవాల‌కు ఆగష్టు 27న పుణ్యాహవచనం, ర‌క్షాబంధ‌నం,   మృత్సంగ్రహణం,  అంకురార్పణ నిర్వహిస్తారు.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  • ఆగష్టు 28న ఉద‌యం 9 గంట‌ల‌కు యాగశాల పూజ, చ‌తుష్టార్చ‌న‌, బింబ‌, మండ‌ల‌, కుంభ ఆరాధ‌న‌లు, ప‌విత్ర ప్ర‌తిష్ట‌, సాయంత్రం 6 గంట‌ల‌కు ప‌విత్ర‌హోమాలు జ‌రుగ‌నున్నాయి.
  • ఆగ‌స్టు 29న ఉద‌యం 9 గంట‌ల‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, ప‌రివార దేవ‌తాల‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ, సాయంత్రం 6 గంట‌ల‌కు నిత్య హోమాలు నిర్వ‌హిస్తారు.  
  • ఆగష్టు 30న ఉద‌యం 6 గంట‌ల‌కు పవిత్ర విస‌ర్జ‌న‌, ప‌విత్ర జ‌ల ప్రోక్ష‌ణ‌, మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, సాయంత్రం 6 గంట‌ల‌కు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.