ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న గర్హ్వాల్ కొండల్లో, అలకనందా నదీ తీరంలో హిమాలయాల్లో 3133 మీటర్ల ఎత్తులో ఉన్న బదరీనాధ క్షేత్రం 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది, ఆదిశంకరాచార్యులచే నిర్మితమైనది. పురాణాలలో బద్రి లేదా బదరికాశ్రమంగా పేర్కొనబడింది. శ్రీమన్నారాయణుడు ఆశ్రమజీవితం గడిపిన ప్రాంతంగా బద్రినాథ్ పురాణ ప్రాధాన్యతను సంతరించు కుంది. భూలోకవాసులను కటాక్షించడానికి గంగానది భువికి దిగిన సందర్భంలో ఆ నదీమతల్లి శక్తిని భరించడం భూదేవికి కష్టం కనుక 12 భాగాలుగా విడిపడి భూలోకాన్ని చేరింది. ఆ 12 భాగాల్లో అలకనందా నది కూడా ఒకటిగా పురాణాలు చెప్తున్నాయి. బదరీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దుల దగ్గరిలో ఉంటుంది.
ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని స్కాంద పురాణంలో పరమేశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామికి వర్ణించినట్టు తెలుస్తోంది. బదరీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని, శివుడు కుమారస్వామికి చెప్పినట్టు పురాణాల ఆధారంగా తెలుస్తోంది. కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగసిద్ధిద అని ద్వాపర యుగంలో విశాల అనే పేర్లతో ఈ క్షేత్రం భాసిల్లిందని చెపుతారు. ఇక్కడి రేగు చెట్ల నుండి అమృతం స్రవించిందని, అందుకే దీన్ని బదరీ క్షేత్రంగా పిలుస్తారని కూడా పురాణేతిహాసాల కథనాల ద్వారా అవగతమవుతోంది. ఒక్క బదరీని సందర్శించినంత మాత్రా ననే అన్ని లోకాల్లోని తీర్థక్షేత్రాలను సందర్శించిన ఫలితం లభిస్తుందన్నది ఈ క్షేత్ర మహిమా సారాంశంగా చెప్పవచ్చు.
బదరీ నాధునిగా అవతరించిన శ్రీమహావిష్ణువు
వైకుంఠంలో మహావిష్ణువు జాడ తెలియక సతమతమవుతున్న లక్ష్మీదేవి ముల్లోకాలను వెతుకుతూ హిమాలయాల్లో తపస్సమాధిలో మునిగి ఉన్న విష్ణుమూర్తి జాడను తెలుసుకుంటుంది. తీవ్రమైన హిమపాతం కురుస్తుండగా తపస్సు ఆచరిస్తున్న పతిని గాంచి హిమపాతము తపస్సుకు భంగం కలిగించకుండా తాను ఒక బదరీ వృక్షం(రేగుచెట్టు) గా మారి స్వామిపై హిమపాతం కురవనీయకుండా అడ్డుకుంటుంది. కొంతకాలానికి విష్ణుమూర్తి నిర్మల మనస్కుడై, శాంత హృదయుడై ఇహలోకంలోకి ప్రవేశిస్తాడు. ఈ తరుణంలో తనను తపోకాలంలో హిమపాతం నుంచి బదరీవృక్ష రూపంలో రక్షిస్తూ వచ్చిన లక్ష్మీదేవిని గాంచి తాను తపస్సు చేసిన ప్రాంతం లో తాను బదరీనాధునిగా భక్తుల పూజలందు కుంటానని చెప్పాడని పురాణగాధలు చెప్తున్నాయి.
ఆలయం ఎప్పుడు తెరుస్తారు?
ఈ ఆలయ ద్వారాలను వైశాఖమాసంలో వచ్చే శుక్ల తదియ నాడు తెరుస్తారు. యాత్ర ఆరు నెలల పాటు కొనసాగు తుంది. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. అయితే ఆలయ తలుపులు మూసి ఉంచిన ఆరునెలలు ఆలయంలో వెలిగించిన అఖండదీపం అలా వెలుగుతూనే ఉంటుంది. మరుసటి సంవత్సరం ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంలో అఖండ దీపాన్ని దర్శించు కోవడానికి లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుండి తరలివస్తారు. ఆలయాన్ని మూసివేసిన కాలంలో స్వామి మూర్తులను బదరీ సమీపంలోని ఆణిమఠ్‌లో ఉండే దేవాలయంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. దీనినే వృద్ధబదరీ అని కూడా వ్యవహరిస్తారు.
యాత్ర ఇలా చేయాలి...
చమోలి జిల్లాలో హిమాలయాల వద్ద ఉన్న దేశసరి హద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతంలో అలకనందా నది దాటిన తర్వాత ముందుగా ఆదికేదార్ మందిరం ఉంటుంది. దాని తరువాత నారద కుండం, వెంటనే ఉష్ణ కుండం తర్వాత బదరీనాథ్ వరుసగా ఎదురయ్యే ప్రాంతాలు. బదరీయాత్ర చేసుకునే ముందు భక్తులు నారదకుండాన్ని దర్శించుకోవాలి. తరువాత ఉష్ణకుండంలో స్నానం చేసి ఆది కేదారేశ్వరుని దర్శించుకుని చివరిగా బరదీనాథ్‌లోని విష్ణుమూర్తిని కనులారాగాంచి యాత్రను ముగిస్తారు. బదరీ చేరుకోవాలంటే ముందుగా ఢిల్లీ చేరుకుని అక్కడినుంచి యాత్ర ముందుకు సాగించాలి. ఢిల్లీకి సుమారు 520 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఢిల్లీ మీదుగా హరిద్వార్, ఋషీకేశ్ వరకూ రైలు మార్గం ఉంది. అక్కడినుండి పూర్తిగా అడవులు, కొండలు మధ్యగా రోడ్డు మార్గం గుండా ప్రయాణం సాగించాలి. దేవప్రయాగ, ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నంద ప్రయాగ, చమోలి, పిపల్‌కోటి, జోషీమఠ్, గోవింద్ ఘాట్, పాండుకేశ్వర్ ప్రాంతాలమీదుగా బదరీయాత్ర సాగుతుంది. ఈ మార్గంలోనే హేమకుండ్ సాహెబ్ అని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం కూడా ఉంది.
చూడవలసిన ఇతర ప్రదేశాలు
బదరీనాథుని ఆలయ ముఖ ద్వారం సమీపంలో లక్ష్మీదేవి ఆలయం కనిపిస్తుంది. బదరీ పరిసరాల్లో వేదాంత దేశిక, రామానుజాచార్యుల మందిరాలు కూడా ఉన్నాయి. బదరీ నుంచి కొంచెం ముందుకు సాగితే ఇవి కనిపిస్తాయి. బదరీ పరిసర ప్రాంతాల్లో నరశిల, నారాయణశిల, నారదశిల, గరుడశిలలు సందర్శించవచ్చు. ఇవి ఉష్ణకుండం దగ్గరగా ఉంటాయి. అలకనందా నది దాటిన వెంటనే వరాహశిలను కూడా సందర్శించవచ్చు. బదరీ గ్రామంలో సతీదేవి యొక్క 108 శక్తిపీఠాలలో ఒక్కటైన ఊర్వశి మందిరం ఉంది. ఇది కూడా ఈ ప్రాంత సందర్శనీయ స్థలాల్లో ప్రముఖమైంది.
ఘంటాకర్ణుని దర్శనం
బదరీనాథ్ ఆలయానికి కొద్ది దూరంలోనే ఘంటాకర్ణుడనే రాక్షసుని విగ్రహం కనిపిస్తుంది. రావణాసురుడు తన సోదరుడైన కుబేరునిపైకి యుద్ధానికి వెళ్ళినపుడు ఘంటాకర్ణుని సైన్యాధికారిగా నియమించుకున్నాడు. ఆ యుద్ధంలో రావణుడు గెలిచి కుబేరుని రాజ్యానికి ఘంటాకర్ణుని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. అయితే తన రాజ్యాన్ని తిరిగి కుబేరునికే అప్పగించ సంకల్పించి తాను శివధ్యానంలో శేషజీవితాన్ని గడుపుతానని ఆయన చెపుతాడు. కానీ కుబేరుడు ఓడిన రాజ్యాన్ని తిరిగి పొందడం వీరుల లక్షణంకాదంటూ తిరస్కరించి బదరీనాథ్ కు సమీపంలో భారతదేశ సరిహద్దు గ్రామంగా పిలిచే మానా గ్రామంలోని కొండల్లో ఒక పర్వత రూపంలో ఉండిపోయాడు. అనంతరం ఘంటాకర్ణుడు దేవతలకు విధేయుడిగా పరిపాలన సాగించి, శివుని మెప్పించి సాక్షాత్కారం పొందాడు. తనను సందర్శించిన వారికి కూడా మోక్షప్రాప్తి కలిగించాలని ఘంటాకర్ణుడు శివుని ద్వారా వరాన్ని పొందాడు.
ఆది కేదార్
కేదార్‌నాథ్ కన్నా ముందు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఆదికేదార్‌లో నివాసముండేవాడట. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వికల మనస్కుడైన విష్ణుమూర్తి తపస్సు చేసుకునేందుకు ఒక అనువైన ప్రదేశాన్ని అన్వేషిస్తాడు. ఈ క్రమంలో మునులను సంప్రదించగా ఆదికేదార్ ప్రాంతాన్ని వారు సూచిస్తారు. కానీ అప్పటికే శివపార్వతులకు అది నివాసస్థలమై యుందన్న విషయాన్ని గ్రహించి ఎట్టి పరిస్థితుల్లోను ఆది కేదార్ ప్రాంతాన్ని తపస్సుకై తన చేజిక్కించుకోవాలని సంకల్పించి మాయోపాయం పన్నుతాడు.
పార్వతీ పరమేశ్వరులు విహారానికై నిత్యం సంచరించే ప్రాంతంలో విష్ణుమూర్తి ఓ బాలుని రూపంలో రోదిస్తూ వారి కంటపడతాడు. పార్వతీదేవి బాలుని చూసి ముచ్చటపడి అక్కున చేర్చుకుని తనతో తమ ఆశ్రమానికి తీసు కెళ్తుంది. మరునాడు యధావిధిగా శివపార్వతులు విహారానికి బయలుదేరిన వేళ మహావిష్ణువు తపోధ్యానంలోకి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చిన శివపార్వతులు తపో ధ్యానంలో మునిగి ఉన్న విష్ణుమూర్తిని చూసి, జరిగిన విషయాన్ని గ్రహించి నొచ్చుకుంటారు. విష్ణుమూర్తికి ఇష్టమైన శనగపప్పు ఆదికేదార్ ప్రాంతంలో పండకూడదంటూ శపించి ప్రస్తుతం కేదార్‌నాధ్ ఉన్న ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోతారని కథనం. బదరీకి సమీపంలో కిలోమీటరు దూరంలో పార్వతికి బాలుని రూపంలో విష్ణుమూర్తి లభించిన చోటును కూడా చూడవచ్చు.
యాత్రలో జాగ్రత్తలు
బదరీయాత్ర ఓ సుదీర్ఘమైన యాత్ర. ఈ యాత్ర చేయాలంటే మానసిక, శారీరక బలం చాలా అవసరం. ఢిల్లీ నుంచి యాత్రా ప్రాంతమంతా అతి శీతల ప్రాంతం. బదరీ వైపు వెళ్తున్నకొద్దీ హిమపాతాలకు నెలవైన ప్రాంతమే. కాబట్టి మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్‌లో శరీరాన్ని కొద్ది రోజులు ఉంచగలిగే వ్యాయామం అత్యంత ఆవశ్యకం. తదనుగుణంగా వైద్యుల సలహాలను కూడా తీసుకోవలసి ఉంటుంది. అతి శీతల ప్రాంతంలో సంచరించేందుకు వీలుగా చలి కోట్లు, ఇతర దుస్తులను సమకూర్చుకోవాలి. సాధారణ స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువాలు వంటివి సరిపోవు. మరీ ముఖ్యంగా యాత్ర ప్రాంతమంతా ప్రమాదాలకు నెలవైన ప్రాంతం.