హిందూ మత విశ్వాసం ప్రకారం ప్రతీ నెలలో కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. హిందూ మతంలో మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాస శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోరిన కోరికలు నేరవేరతాయని నమ్మకం
మస శివరాత్రి రోజు శివుని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. పెళ్లికాని ఆడపిల్లలు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. శివయ్య అనుగ్రహంతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు.
ప్రతీ నెలా బహుళపక్షంలో వచ్చే ఈ మాస శివరాత్రి రోజున నిర్మలమైన హృదయంతో శివుడిని పూజించే వ్యక్తి కోరికలను ఆ పరమశివుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. జీవితంలో ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు.
మాసశివరాత్రి పూజ ఎలా చేయాలి?
మాసశివరాత్రి రోజున ఉపవాస దీక్షని చేస్తారు. అలాగే శివుని స్తోత్రాలు స్మరించుకుంటారు. ప్రదోషవ్రతం చేసినప్పుడు శివుడికి జలాభిషేకం, బిల్వపత్ర పూజ శ్రేష్ఠం. ఇంట్లో శివలింగం ఉంటే చెరుకు రసం, పంచామృతం, పచ్చి పాలు, గంగాజలం, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగు,భస్మం, చందనంతో పంచామృతాలతో శివయ్యను అభిషేకించాలి. తర్వాత శివాష్టకం పఠిస్తూ తుమ్మి పూలతో కానీ, నీలం శంఖు పూలతో కానీ, మారేడు దళాలు, ఉమ్మెత్త పువ్వులు, కాయలుతో కానీ ఈశ్వరుని పూజించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ హారతులు, కర్పూర నీరాజనాలు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి
2025వ సంవత్సరం మే నెల నుంచి వచ్చే మాసశివరాత్రి రోజులు
- ఆదివారం, 25 మే మాస శివరాత్రి
- సోమవారం, 23 జూన్ మాస శివరాత్రి
- బుధవారం, 23 జూ మాస శివరాత్రి
- గురువారం, 21 ఆగస్టు మాస శివరాత్రి
- శుక్రవారం, 19 సెప్టెంబర్ మాస శివరాత్రి
- ఆదివారం, 19 అక్టోబర్ మాస శివరాత్రి
- మంగళవారం, 18 నవంబర్ మాస శివరాత్రి
- గురువారం, 18 డిసెంబర్ మాస శివరాత్రి
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల 14వ రోజున క్షీణ చంద్రుడు (కృష్ణ పక్ష) అర్ధభాగంలో మాసిక శివరాత్రి జరుపుకుంటారు. మాసిక అంటే 'నెలవారీ' మరియు శివరాత్రి అంటే 'శివుని రాత్రి'. ప్రతి నెలా ఈ రోజును పాటిస్తారు, అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మాసి శివరాత్రి ఉపవాసం భక్తులు తమ ఇంద్రియాలను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, కోపం, అసూయ, గర్వం మరియు దురాశ వంటి దుష్ట భావాలను అరికట్టడానికి కూడా ఇది సహాయపడుతుంది.
మాసశివరాత్రి యొక్క ప్రాముఖ్యత
మాసశివరాత్రిని పరమేశ్వరుడైన శివుడికి సంబంధించిన శక్తివంతమైన మరియు పవిత్రమైన దినముగా భావిస్తారు. మెరుగైన జీవితము కోరుకునే పురుషులు మరియు మహిళలు దీనిని ఆచరిస్తారు. రోజంతా ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉంటే అన్ని ప్రాపంచిక కోరికల నుండి మీ మనసును దూరంగా ఉంచుకోవచ్చని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇబ్బందులనుంచి త్వరగా బైటపడడం, ఆరోగ్యం చేకూరడం వంటి ఫలితాలు మాసశివరాత్రి ఉపవాసం వల్ల కలుగుతాయి. ఒత్తిడులు దూరమై, సుఖజీవనం కలుగుతుంది.