శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ అంటే తరగనిదని అర్థము.
అక్షయ తృతీయ రోజు పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి.
పురాణాలలో అక్షయ తృతీయ ప్రాముఖ్యత
శివుని అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది అక్షయ తృతీయ రోజునే. మహాలక్ష్మి శ్రీహరిని వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేరుంది. ఈ రోజు లక్ష్మీ దేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయి.
కృతయుగారంభం ఈ రోజునే
అక్షయ తృతీయగా జరుపుకునే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేది. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుని కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమథనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే!
నరసింహ స్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టే అక్షయ తృతీయ నాడు రాహుకాలాలూ వర్జ్యం వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ రోజు ఓ కొత్తకుండలో గానీ, కూజాలో గానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనైనా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు.
పరమపూజ్యులైన పరశురాముని జన్మదినోత్సవం, శ్రీకృష్ణుని అన్నగారు బలరాముని జన్మదినోత్సవం ఈ పర్వదినం రోజునే. శివుని జటాఝూటం నుంచి గంగ ఉప్పొంగింది కూడా ఈరోజునే. కడుపేదరికంలో ఉండి శ్రీకృష్ణుని చెంతకు వచ్చిన ఆయన స్నేహితుడు సుదామునికి అష్టైశ్వర్యాలు సిద్ధింపచేసింది నేడే అని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఈ దానాలు చేయండి
అతిథులకు, అభ్యాగతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజూ అకలితో మనం అలమటించాల్సిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తరజన్మలలో వాటికి లోటురాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రల వంటివి దానం చేయాలి.
ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్లకపోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయతృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చుతుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.