హిందువులు తప్పనిసరిగా చేసి తీరాలని కలలుగనే యాత్ర చార్‌ధామ్ యాత్ర. ఈ యాత్రలో ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సినా జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాలని ప్రతీ హిందువు ఆశిస్తాడు. ఇలాంటి చార్‌ధామ్ యాత్రకు వేళయింది. అక్షయతృతీయతో ప్రారంభమయ్యే ఈ చార్ ధామ్ యాత్ర విశేషాలను గురించి తెలుసుకుందామా.
చార్‌ధామ్ యాత్రలోని పవిత్ర దేవాలయాలు
యమునోత్రి ఆలయం
యమునోత్రి యమునా నదికి మూలం. యమునా దేవికి అంకితం చేయబడింది.
ఏప్రిల్ 30, 2025 అక్షయ తృతీయ రోజున యమునోత్రిలో దర్శనాలు ప్రారంభిస్తారు.
అక్టోబర్ 23, 2025 యమునా జయంతిరోజున ఆలయం మూసివేస్తారు.
గంగోత్రి ఆలయం
గంగోత్రి గంగా నది జన్మస్థలం. గంగా మాతకు అంకితం చేయబడింది.
ఏప్రిల్ 30, 2025 అక్షయ తృతీయ రోజున గంగోత్రి ఆలయం తెరుస్తారు.
అక్టోబర్ 22, 2025 జూన్‌లో గంగా దసరా రోజున ఆలయంలో దర్శనాలు నిలుపుచేస్తారు.
కేదార్‌నాథ్ ఆలయం
కేదార్‌నాథ్ - శివుడికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.
కేదార్‌నాథ్‌లో మే 2, 2025 శుక్రవారం దర్శనాలు ప్రారంభిస్తారు.
అక్టోబర్ 23, 2025 భైరవ ఉత్సవం రోజుతో దర్శనాలు నిలిపివేస్తారు.
బద్రీనాథ్ ఆలయం
బద్రీనాథ్ ఆలయం బద్రీనారాయణ రూపంలో విష్ణువుకు అంకితం చేయబడింది.
మే 4, 2025 ఆదివారం నుంచీ బద్రీనారాయణుని దర్శనాలు ప్రారంభమవుతాయి.
నవంబర్ 6, 2025 తో బదరీనాథ్ లో దర్శనాలు నిలుపుచేస్తారు. బదరీనాథ్ లో సెప్టెంబర్‌లో మాతా మూర్తి కా మేళా విశేషంగా నిర్వహిస్తారు.
భాయ్ దూజ్(భగినీహస్తభోజనం) రోజున యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలు, విజయ దశమి రోజున బద్రీనాథ్ ఆలయం మూసివేయబడతాయి. దేవతలను వారి శీతాకాల నివాసాలకు తరలిస్తారు. కేదార్‌నాథ్ విగ్రహాన్ని ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. గంగోత్రి దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది .
చార్ ధామ్ యాత్ర 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ
చార్ ధామ్ యాత్రకు వీఐపీ దర్శనం అదనపు ఖర్చుతో లభిస్తుంది.
ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్ (యుటిడిపి) ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎంపికలను అందిస్తుంది. చార్ ధామ్ యాత్ర చేపట్టే అందరు యాత్రికులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి మరియు జనసమూహ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేసి క్రమబద్ధీకరించారు.
చార్‌ధామ్ యాత్ర 2025 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభం. ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ల కంటే ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళ్ళడం వల్ల యాత్ర సులభంగా సాగుతుంది.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల కోసం అధికారిక పోర్టల్ https://registrationandtouristcare.uk.gov.in/ ను సందర్శించండి. ఈ పోర్టల్ లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని తరువాత రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తిచేయాలి.
- ప్రభుత్వ ID ప్రకారం పూర్తి పేరు
- వయస్సు మరియు లింగం
- శాశ్వత చిరునామా
- మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID
- ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు , పాన్ కార్డు, ఓటర్ఐడీ కార్డు వీటిలో ఏదైనా ఒకటి.
ఇటీవల తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ డిజిటల్ ఫార్మాట్ లో అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలి. మీరు ముందుగా నిర్ణయించుకున్న యాత్రల తేదీలను కూడా రిజిస్ట్రేషన్ లో భాగంగా పొందుపరచాల్సి ఉంటుంది. చార్‌ధామ్ లలో ప్రతీ క్షేత్రానికి మీ ప్రయాణ వెసులుబాటును బట్టి తేదీలను నిర్ణయించుకుని పూరించి దర్శనం స్లాట్ ను బుక్ చేసుకోవాలి. ఇంకా రిజిస్ట్రేషన్ ఫారమ్ లో అడిగిన సమాచారాన్ని పొందుపరిచి ఆన్‌లైన్ ద్వారా అవసరమైన రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి రిజిస్ట్రేషన్ ఫారాలను ప్రింట్ చేసి మీ దగ్గర ఉంచుకోవాలి. ఎన్ని క్షేత్రాలను దర్శిస్తారో అన్ని కాపీలను మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రతీ కాపీతో పాటు మీ గుర్తింపుకార్డు జిరాక్సు కాపీని జత చేయాలి. అదేవిధంగా దాని ఒరిజినల్ కూడా మీ వెంట తీసుకువెళ్ళాలి.
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎంపికలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేశ్, గుప్త్ కాశి మరియు సోన్‌ప్రయాగ్‌లతో సహా ఉత్తరాఖండ్‌లోని ప్రధాన నగరాల్లో నియమించబడిన రిజిస్ట్రేషన్ కౌంటర్లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక సమాచార కేంద్రాలు
చార్ ధామ్ మార్గాలకు ప్రవేశ కేంద్రాల వద్ద ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లో సమర్పించిన విధంగానే గుర్తింపుకార్డు తదితరపత్రాలు చూపించాల్సి ఉంటుంది. మీ తాజా ఫొటోగ్రాఫ్, హెల్త్ సర్టిఫికెట్ మీతో తీసుకురావడం మరిచిపోకండి. ప్రధానంగా మీ గుర్తింపుకార్డు ఒరిజినల్ తప్పనిసరిగా మీతోనే ఉండాలి. దయచేసి గమనించండి: 12 ఏళ్లలోపు పిల్లలు మరియు 65 ఏళ్లు పైబడిన పెద్దలకు అదనపు వైద్య అనుమతులు అవసరం. హెలికాప్టర్ వినియోగదారులు అధీకృత ఆపరేటర్ల ద్వారా విడిగా సేవలను బుక్ చేసుకోవాలి.
ఆలయాల దర్శన వేళలు-హారతి సమయాలు
యమునోత్రి
ఉదయం 7:30నుంచి మధ్యాహ్నం 12:00 మధ్యాహ్నం 2:00–రాత్రి 8:00 వరకూ దర్శనాలు ఉంటాయి.
ఉదయం 6:30 కు, సాయంత్రం 6:30 హారతి ఉంటుంది.
గంగోత్రి
ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 2:00వరకూ, మధ్యాహ్నం 3:00–రాత్రి 8:00 దర్శనవేళలు ఉంటాయి.
ఉదయం 6:00కు, సాయంత్రం 7:00 గంటలకు హారతి ఇస్తారు.
కేదార్‌నాథ్
ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 నుంచి రాత్రి 7:00 వరకూ దర్శనవేళలు ఉంటాయి.
ఉదయం 4:00 గంటలకు, సాయంత్రం 6:00 గంటలకు హారతి సమయాలు.
బద్రీనాథ్
ఉదయం 6:00గంటల నుంచి మధ్యాహ్నం 1:00, సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 7:00 వరకూ దర్శనాలు ఉంటాయి.
ఉదయం 4:30కు, రాత్రి 8:30కు గీత్ గోవింద్ మరియు వేదపథ్ పారాయణాలు వంటి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు.
చార్ధామ్ యాత్రను సందర్శించడానికి ఉత్తమ సమయం
- యాత్ర మే నుండి అక్టోబర్ వరకు తెరిచి ఉన్నప్పటికీ, మే-జూన్ మరియు సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.
- మే ప్రారంభంలో మరియు అక్టోబర్ చివరిలో సాధారణంగా రద్దీ తక్కువగా ఉంటుంది.
- యమునోత్రి యాత్ర జానకి చట్టి నుండి 6 కి.మీ. దూరం ఉంటుంది. నడకద్వారా అయితే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
- గంగోత్రికి చేరుకోవడానికి నడక అవసరం లేదు. ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం ఉంటుంది.
- కేదార్‌నాథ్ ఆలయానికి గౌరికుండ్ నుండి 18 కి.మీ. ట్రెకింగ్ చేయాల్సి ఉంటుంది. పదిగంటల సమయం పడుతుంది. హెలికాఫ్టర్ల ద్వారా, గుర్రాలు, డోలీల ద్వారా తగిన రుసుము చెల్లించి చేరుకోవచ్చు.
- బద్రీనాథ్ ఆలయానికి కూడా నడక అవసరం లేదు ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం ఉంది.
- హెలికాఫ్టర్ సేవలకోసం
- చార్‌ధామ్ యాత్రకు హెలికాప్టర్ సేవలకోసం అధీకృత ఆపరేటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. వాటికి డిమాండ్ ఎక్కువగాఉండడం వల్ల ముందుగానే బుక్ చేసుకోండి.
వసతి
మీ బడ్జట్ లో వసతి సదుపాయాలను ముందుగానే బుక్ చేసుకుని ఉంచితే మంచిది.
GMVN వంటి ప్రభుత్వం నిర్వహించే అతిథి గృహాలు బార్కోట్, హర్సిల్ మరియు జోషిమఠ్ వంటి ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయి.
మతపరమైన ట్రస్టులు మరియు సంస్థలు నిర్వహిస్తున్న ధర్మశాలలు కూడా అతి తక్కువ ధరకు వసతులను కల్పిస్తాయి.
కేదార్‌నాథ్‌లో ఉండగలిగిన వాళ్ళకు టెంట్ వసతి అందుబాటులో ఉంది.
అత్యంత ఎత్తైన ప్రాంతాలలో ఈ చార్‌ధామ్ క్షేత్రలు ఉండడంతో హై యాల్టిట్యూట్ లో వచ్చే అనారోగ్యానికి అవసరమైన మందులు దగ్గర ఉంచుకోవాలి.
మీ యాత్రను ప్లాన్ చేసుకునే ముందు వాతావరణ సూచనలను తనిఖీ చేయండి మరియు వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉన్నప్పుడే ఈయాత్రసాధ్యం.