శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 25వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం మార్చి 24వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
ఇందులో భాగంగా మార్చి 25న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 25న స్వర్ణపుష్పార్చన, నిత్య కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.