ఉగాది పచ్చడి సంపూర్ణ ఆయుర్వేద ఔషదం అని చెప్పాలి. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి పూర్వీకులు వినియోగించేవారు.
కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అశోేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచి పసుపు కలిపి నూరి ఉగాది పచ్చడిలో కూడా కలిపేవారని పెద్దలు చెబుతారు. మామూలుగా కూడా ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంతో జీర్ణ సంబంధ వ్యాధులకు గొప్ప ఔషదమని సిద్ధ వైద్యుల ఉవాచ.
పూర్వం వీలును బట్టి ఉగాది నుండి తొమ్మిది రోజులు కానీ, పదిహేను రోజులుకానీ ఉగాది పచ్చడిని సేవించేవారు. నేడు ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది కూడా ఓ నమ్మకం.
సంపూర్ణ ఆయుర్వేద ఔషధం
ఉగాది పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్టమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట. అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి.
ఎంతో రుచికరం ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి ఎలా చేసినా ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని తయారీ విధానాన్ని కూడా ఒకసారి పరిశీలిద్ధాం.
కావలసిన పదార్డాలు
వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగా పండిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారము-చిటెకెడు లేదా పచ్చిమిరపకాయ-1, ఉప్పు-అరస్పూను, గుల్ల శనగపప్పు ి-1కప్పు(కమ్మదనం కోసం వేయించిన వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు), చింతపండు-నిమ్మకాయంత, కొద్దిగా చెరుకుముక్కలు.
తయారీ విధానం
అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి, అంతే రుచికరమైన ఉగాది పచ్చడి సిద్ధం.