శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.