పూర్వం ఒక రాజ కుటుంబం ఈ గణపతిని ప్రతిష్టించి పూజించేవారు. అయితే ఈ గణపతి విగ్రహం ముస్లింరాజుల దాడిలో ధ్వంశం చేయబడింది. కాలక్రమంలో పశువుల కాపరులకు ఈ విగ్రహం కనపడింది. ఈ గణపతిని దోసకాయలు పండించే పొలంలో పెట్టి వాళ్ళు పూజించడం ప్రారంభించారు. తరువాత ఈ విషయం గ్రామస్థులందరి చెవినా పడింది. అందరూ కలిసి గణపతికి ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టించాలని సంకల్పించారు. అయితే గణపతి ఒక రైతు కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించవద్దని దోసకాయల పొలంలోనే ప్రతిష్టించాలని చెప్పారుట. అప్పటినుంచీ గణపతిని దోసకాయల పొలంలోనే ప్రతిష్టించి పూజించడం ప్రారంభించారు. ఈగణపతి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటాడు. ఎటువంటి ఆలయం లేకుండా ప్రకృతి ఒడిలో కొలువుదీరాడు.
స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే...
కన్నడభాషలో సౌత అంటే దోసకాయ, అడ్క అంటే మైదానము లేక పొలము అని అర్థం. ఈ గణపతి దోసకాయల పొలంలో స్థిరపడినందున ఆయనకు సౌతడ్క గణపతి అని పేరు వచ్చింది.
ఆలయంలో సేవలు
- ఇక్కడి స్వామికి ప్రతిరోజూ అటుకులు, కొబ్బరి, తేనె, నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదం చేసి నివేదిస్తారు. దీనినే ‘పంచకజ్జయి సేవ’అంటారు. స్వామికి నివేదించిన ఈ అటుకుల ప్రసాదాన్ని చుట్టుపక్కల గోవులకు తినిపిస్తారు. గ్రామంలోని మిగిలిన రైతులు కూడా ప్రసాదాన్ని తీసుకెళ్ళి తమ గోవులకు తినిపిస్తారు. ఇది ఇక్కడి ఆచారం.
- మూడపుసేవ అని కూడా ఇక్కడ స్వామికి నిర్వహిస్తారు. ఈ సేవలో భాగంగా అప్పాలతో మొత్తం స్వామి విగ్రహాన్ని కప్పుతారు.
- దోసకాయల సీజన్ లో తప్పనిసరిగా ప్రతిరోజూ ఒక బుట్టెడు దోసకాయలు తీసుకువచ్చి స్వామికి నివేదిస్తుంటారు రైతులు. ఇలా చేయకుండా తమ వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించరు.
- సంతానం కావలసిన వారు ఇక్కడి స్వామిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఋణవిముక్తి కోసం ఈ స్వామికి మొక్కుకుంటారు. తమ మొక్కలు తీర్చాలని కోరుతూ ఈ ఆలయంలో ఇత్తడి గంటలు కడుతుంటారు.
- పిల్లలకు అన్నప్రాశనలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు.
- ఈ ఆలయంలో200 పైగా గోవులను సంరక్షిస్తున్నారు.
ఆలయంలో ఉత్సవాలు
ప్రతి ఏడాది జనవరి నెలలో సౌతడ్క గణపతికి మహాపూజ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
దీనితోపాటు గణపతి నవరాత్రుల్లో విశేష పూజలు జరుగుతాయి.
శివకుటుంబం తరలివచ్చిందా?
కర్ణాటక రాష్ట్రంలోని సౌతడ్క గణపతి ఆలయానికి 35 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కుక్కేసుబ్రహ్మణ్య , 16 కిలోమీటర్లదూరంలో ధర్మస్థల నెలకొని ఉన్నాయి. ఇక్కడ స్థానికులు దోసకాయలకోసం వచ్చి దోసతోటల్లో స్థిరపడిపోయిన గణపతిని వెతుక్కుంటూ వచ్చిన తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి పక్కనే కుక్కే లో వెలిసారని, కుమారులిద్దరినీ వెతుక్కుంటూ వచ్చిన ఉమామహేశ్వరులు మంజునాధేశ్వరుడు, అమ్మన్నవారు పేర్లతో స్థిరపడినట్లు చెప్పుకుంటారు.