వాహన సేవల్లో సాక్షాత్కరిస్తున్న పద్మావతి అమ్మవారు

చిన్నశేష వాహనంపై మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న‌శేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు.

మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో సిరులతల్లి

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.

వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి పాల్గొన్నారు.