వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

సాయంత్రం 5.30 గంటల నుండి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి పాల్గొన్నారు.

ధ్వజారోహణం 

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.

అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం.

అనంత‌రం ఉద‌యం 10.30 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు వైభ‌వంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

పెద్దశేషవాహన సేవ

సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌, రాత్రి 7 గంట‌ల‌కు  శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను క‌టాక్షిచారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు 

  • 17-05-2024     ఉదయం – చిన్నశేష వాహనం ,    రాత్రి – హంస వాహనం
  • 18-05-2024     ఉదయం – సింహ వాహనం,    రాత్రి – ముత్యపుపందిరి వాహనం
  • 19-05-2024    ఉదయం – కల్పవృక్ష వాహనం,    రాత్రి – సర్వభూపాల వాహనం
  • 20-05-2024    ఉదయం – మోహినీ అవతారం,     రాత్రి – గరుడ వాహనం
  • 21-05-2024    ఉదయం – హనుమంత వాహనం,    రాత్రి – గజ వాహనం
  • 22-05-2024    ఉదయం – సూర్యప్రభ వాహనం,    రాత్రి – చంద్రప్రభ వాహనం
  • 23-05-2024    ఉదయం – రథోత్సవం,    రాత్రి – అశ్వవాహనం
  • 24-05-2024    ఉదయం – చక్రస్నానం,    రాత్రి – ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.