ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. భ్రమరాంబ సమేతుడైన మల్లి కార్జునస్వామి మయూర వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.
అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరింపచేస్తున్నారు. స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పిస్తున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు ముఖ్య కార్యక్రమాలు
- మార్చి 1 న యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, ఆరోజు సాయంత్రం ధ్వజారోహణ, మార్చి 2 వ తేదీన భృంగివాహన సేవ, మార్చి 3 వ తేదీన హంసవాహనసేవ, మార్చి 4 వతేదీన మయూరవాహనసేవ, మార్చి 5 వతేదీన రావణవాహన సేవ మార్చి 6 వతేదీన పుష్పపల్లకీ సేవ కన్నులపండువగా జరిగాయి.
- మార్చి 7 వతేదీన గజవాహనసేవ,
- మార్చి 8 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం,
- మార్చి 9 వతేదీన స్వామి అమ్మవారికి రథోత్సవం రాత్రి తెప్పోత్సవం,
- మార్చి 10 వ తేదీన యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
- మార్చి 11 వ తేదీన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం బ్రహ్మోత్సవాలు ముగింపు.
శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు
శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించింది.
శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 1న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.