శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు.
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుని వసంతోత్సవం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది.
బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని అలసి వుంటారు కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకున్నారు.
సూర్యప్రభ వాహనంపై శ్రీరామ కృష్ణ గోవింద అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామ కృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
స్నపన తిరుమంజనం
ఉదయం 10.30 నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
మార్చి 7న రథోత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 5 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 8 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.