అంగరంగ వైభవంగా కళ్యాణవెంకటేశుని రథోత్సవం

శ్రీ‌నివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది. 

శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సుందరంగా అలంకరించిన  రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు . వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు  చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి రథ ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

 రథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.