శ్రీరంగనాధుడు కొలువై ఉన్న క్షేత్రం శ్రీరంగం

శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయం కావేరి - కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉంది. ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణుభగవానిని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం కూడా. శ్రీరంగం శ్రీమహావిష్ణువు దివ్యక్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనది. విష్ణువు పాలసముద్రం నుండి ఉద్భవించినది ఇక్కడే  అని పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రపంచములో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువరంగన్ అనేవి శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు. శ్రీరంగం ఆలయాన్ని " ఇండియన్ వాటికన్" గా కూడా పిలుస్తారు. రావణుడు తమ్ముడు విభీషణుడు, అన్న చేసే దురాగతాలు చూడలేక హితబోధనలు చేస్తాడు. నీవు చెప్తే నేను వినాలా !! అన్నట్లు రావణుడు ఆ మాటలను పెడచెవిన పెడితే, విభీషణుడు రాముడు వద్దకు వెళతాడు. రావణుడి వధ అనంతరం, విభీషణుడు భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చి, దానిని కింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు. లంక కు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. కాసేపయినాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు ... కానీ ఆ విగ్రహం లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు (లంక దక్షిణ దిక్కున కలదు).

ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం

సుమారు 157 ఎకరాలలో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం కలదు. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉన్నది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవత మూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. బహుశా మరే విషుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవేమో !!

శ్రీరంగం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. భక్తులు వీటిగుండా లోనికి నడుచుకుంటూ వెళుతారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది.

గరుడాళ్వార్

శ్రీరంగం ఆలయంలో గరుడాళ్వార్ విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహానికి వస్త్రాలంకరణకు 30 మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది. గురుడాళ్వార్ కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా కలదు.

ధన్వంతరి దేవాలయం

శ్రీరంగం ఆలయంలో మాత్రమే సాగర మథనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్య కారకుడైన ధన్వంతరికి దేవాలయం కలదు. ఈ ఆలయంలోనే స్వామి రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీ. శ. 8 వ శతాబ్దంలో భద్రపరిచారు.

బ్రహ్మోత్సవాలు

శ్రీరంగనాథ స్వామి వారికి ఏటా మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అవి తాయ్ (జనవరి - ఫిబ్రవరి), పంగుని (మార్చి - ఏప్రియల్), చిత్తిరై(ఏప్రియల్ - మే). ఈ బ్రహ్మోత్సవాలను తిలకించటానికి దేశంలోని విష్ణు భక్తులు శ్రీరంగం తరలివస్తుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగం దేవాలయాన్ని 10 లక్షల మంది దర్శించుకుంటారు.

శ్రీరంగం ఇలా చేరుకోవచ్చు

శ్రీరంగం ఇలా చేరు కోవచ్చు. శ్రీరంగంలో రైల్వే స్టేషన్ ఉంది.  అయినప్పటికీ 9 కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ సూచించదగినది . హైదరాబాద్, చెన్నై,విజయవాడ, కన్యాకుమారి, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ స్టేషన్ లో ఆగుతాయి. 

 10 కిలోమీటర్ల దూరంలో ట్రిచి దేశీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ కు దేశం నలుమూలల నుండి విమానాలు వస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి శ్రీరంగం చేరుకోవచ్చు. ఇక రోడ్డుమార్గానికి వస్తే శ్రీరంగం క్షేత్రానికి తిరుచిరాపల్లి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.