లేపాక్షి టెంపుల్: ఆంధ్రప్రదేశ్ లో హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలోలేపాక్షి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్నవీరభద్రేశ్వరస్వామి ఆలయం మన దేశ అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటిచెబుతుంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో ఒక విచిత్రం ఏమిటంటే 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక స్తంభం నేలను తాకకుండా నిలబడి ఉంటుంది. ఆ స్తంభం కింద ఖాళీని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు.
లేపాక్షి ఆలయ చరిత్ర
త్రేతాయుగంలో రావణుడు సీతమ్మతల్లిని అపహరించుకుని పోతుంటే అడ్డుపడిన జఠాయు పక్షి రావణుడి చేతిలో గాయపడి ఈ ప్రాంతంలోనే పడిపోయిందని పురాణ కథనం. అప్పుడు సీతను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు జఠాయువును ‘‘లేపక్షి’’ అని పిలిస్తే జఠాయువు లేచి నిలుచుందిట. అందుకే ఈ ప్రాంతాన్ని లేపక్షి అని కాలానుగుణంగా లేపాక్షి అని పిలువబడుతోందని తెలుస్తోంది.
ఇక్కడ వీరభద్రేశ్వర ఆలయంలో లింగం అగస్త్యమునిచే ప్రతిష్ఠించబడిందని ప్రతీతి. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యాధీశుడు అచ్యుత దేవరాయలి వద్ద పనిచేస్తున్న కోశాధికారి వీరూపన్న నిర్మించాడు. అయితే ఈ ఆలయ నిర్మాణం కోసం రాజు అనుమతి తీసుకోలేదు. ఈ విషయం విరూపన్న వ్యతిరేకుల ద్వారా రాజుకు చేరుతుంది. అది తెలుసుకున్న విరూపన్న రాజు ఆగ్రహానికి గురవడం తధ్యమని తలంచి రాజు వేసే శిక్షను ముందుగానే గ్రహించి తన రెండు కళ్ళు పీకి ఆలయ గోడకు తగిలేలా విసురుతాడు. కళ్ళు తగిలిన ప్రాంతంలో రక్తపు మరకలు నేటికీ కనిపిస్తుంటాయి. ఈ కారణం వల్ల ఆలయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని తెలుస్తోంది.
లేపాక్షి ఆలయానికి యునెస్కో గుర్తింపు
లేపాక్షి ఆలయం యునెస్కో వారి వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇక్కడ బసవయ్య విగ్రహం 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉంటుంది. వీరభద్రేశ్వర స్వామి ఆలయం 108 శైవక్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. గర్భాలయంలో వీరభద్రుడు పురుష ప్రమాణంలో దర్శనమిస్తాడు. ఆలయానికి ఈశాన్యంలో నవగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు.
41 స్తంభాలతో నిర్మితమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమండపం కూడా ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి. ఈ మండపం కూడా అసంపూర్తిగా నిలిచిపోయి కనిపిస్తుంది.
ఆలయంలో దర్శించదగ్గ ప్రధానమూర్తులు వినాయకుడు, నాగలింగం. ప్రధానంగా ఇక్కడ ఏడుతలలున్న నాగలింగం అద్భుతంగా ఉంటుంది. ఈ నాగలింగాన్ని శిల్పులు భోజనానికి ఇంకా గంట సమయం ఉందని వారి తల్లి చెప్పడంతో ఈ గంట సమయంలో ఏం చేద్దామని ఆలోచింని ఒకే రాతిపై దీనిని మలచినట్టు స్థానికులు చెబుతారు. ఈ కథ నాటి శిల్పుల నేర్పరితనాన్నిచాటి చెబుతుంది.
ఆలయ ఆవరణలో ఓ పెద్ద పాదముద్ర కనిపిస్తుంది. అది సీతమ్మవారి పాదముద్రగా చెబుతారు. అందరూ ఆ పాదానికి మొక్కుతుంటారు.