వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని తంజావూరు ఆలయం

తమిళనాడు రాష్ట్రంలో ఉన్నచారిత్రక ప్రదేశాల్లో తంజావూరు ముఖ్యమైనది. ఇక్కడి ఆలయాల్లోని శిల్పకళ అలనాటి శిల్పుల కళానైపుణ్యానికి అద్దం పడుతుంది. తంజావూరులో 74 దేవాలయాలున్నాయి. వాటిలో బృహదీశ్వరాలయం చాలా ప్రాముఖ్యత కలిగినది. 

బృహదీశ్వరాలయ విశిష్టత

బృహదీశ్వరాలయాన్ని 1,30,000 టన్నుల గ్రానైట్ రాయితో నిర్మించారు. ఆలయం గోపురం 66 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ గోపురంపై 80 టన్నుల భారీ రాతి కుంభాన్ని ఏర్పాటుచేసారు. ఇంత బరువైన రాతిని గోపురం పైకి ఎలా చేర్చారో ఇంజనీర్లకు కూడా నేటికీ అంతుపట్టని మిస్టరీగా ఉంది. ఆలయ నిర్మాణంలో ఇనుము కానీ, సిమెంటు కానీ వాడలేదు. ఆలయం మొత్తం ఇంటర్ లాకింగ్ సిస్టం ద్వారా నిర్మించారు. ఈ గోపురం నీడ ఏ సమయంలోనూ నేలపైన పడని విధంగా ఈ ఆలయ నిర్మాణాన్ని చేసారు. ఆలయ ప్రాంగణంలో 250 శివలింగాలు, 108 భరతనాట్య భంగిమలోని శిల్పాలు ఉన్నాయి. 

చోళరాజుల చేత నిర్మించబడిన ఈ ఆలయం 1010లో నిర్మాణం పూర్తయింది. అంటే 2010 నాటికి 1000 సంవత్సరాలు పూర్తిచేసుకుందన్నమాట. ఇంతకాలం పూర్తయినా నేటికీ కొత్తగా నిర్మించినట్లు ఎంతో కళతో ప్రకాశిస్తూ ఉంటుంది. 

యునెస్కో గుర్తింపు

బృహదీశ్వరాలయం 1987లో యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 

ఆలయంలో శివుడు బృహదీశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా కొలువుదీరారు. 

ఆలయం ఎదురుగా ఉండే 16 అడుగుల పొడవు, 13 అడుగుల ఎత్తు కలిగిన నందీశ్వరుని విగ్రహం కూడా ఏకశిలపై ఎంతో రమణీయంగా మలిచారు శిల్పులు. ఈ ఆలయాన్ని పెరికోయల్ అని పిలుస్తారు.

బృహదీశ్వర ఆలయ చరిత్ర

బృహదీశ్వర ఆలయంలోని శిల్పకళ అంతా చోళరాజుల కళాపోషణకు అద్దంపడుతుంటుంది. రాజరాజచోళగా ప్రసిద్ధిచెందిన తమిళ చక్రవర్తి ఈ ఆలయానికి 1002 లో పునాది వేసారని చరిత్ర చెబుతోంది. 

ఆలయ ప్రాంగణంలో సూర్యచంద్రుల మూర్తులు, దక్షిణామూర్తి కూడా దర్శనమిస్తారు. దేశంలోనే అతిపెద్ద శివలింగం ఇక్కడ ఉంది. ఆలయ గోపురం 13 అంతస్తులుగా ఉంది. దేశంలోని పురాతన ఆలయాల్లో ఇది పెద్దది.

ఆలయం చూడటానికి కొత్తగా నిర్మించినట్టుగానే ఉంటుంది. ఈ ఆలయంలో అష్టదిక్పాలకులు దర్శనమిస్తారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వారుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఎనిమిది దిక్కుల్లోనూ ప్రతిష్ఠితమై ఈ ఆలయంలో కనిపిస్తారు. అష్టదిక్పాలకులు దర్శనమిచ్చే అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి.

ఏకంగా ఆరు భూకంపాలను తట్టుకుని నిలబడింది. ఒక శిలను, మరొక శిలకు ఇంటర్ లాక్ చేస్తూ నిర్మాణం జరిగింది. ఈ ఆలయానికి పునాది లేదు.