సౌభాగ్యంకోసం సా విత్రిగౌరీ వ్రతం

సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. ముక్కనుమ రోజున  మహిళలు సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ నోమునే బొమ్మలనోము అని కూడా పిలుస్తారు.  సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరాహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులపాటు చేయాలి. దేవిని తొమ్మిది రోజులు పూజించి రోజుకో పిండివంట చొప్పున తొమ్మిదిరకాల పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. 

ముక్కనుమ నాడు  వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోము ఆచరింపచేస్తుంటారు పెద్దలు. నోములో భాగంగా మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.  ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పండ్లు, తాంబూలం వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.

ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన వివాహితలకు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది.