తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వీటిని వైభవంగా నిర్వహి౦చడానికి టిటిడీ అన్ని ఏర్పాట్లు చేస్తో౦ది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. నవంబరు 9వ తేదీన లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహి౦చనున్నారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. విశేషమైన పంచమి తీర్థం నాడు పుణ్యస్నానాలకోస౦ వచ్చే లక్షలాది మంది భక్తులకోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో అమ్మవారి పుష్కరిణి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. త్వరలో నీటిని నింపి పుష్కరిణి అందుబాటులోకి వస్తు౦ది. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.