ఉప్పులూరు చెన్నకేశవుని దర్శిద్దాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పల్నాడు ప్రాంతం ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో కొలువైన చెన్నకేశవస్వామికి 11 తరాల నుంచి బ్రాహ్మణేతరులు అర్చకులుగా నిత్య పూజలు చేస్తున్నారు.  ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే స్వామి రథోత్సవాన్నే ఇక్కడ పెద్ద పండుగగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన స్థానికులంతా స్వామివారి కళ్యాణోత్సవాలను తిలకించేందుకు   గ్రామానికి తరలి వస్తారు. ప్రతి ఇంటి నుంచి ఓ అరటి గెలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. 

ఇదీ చరిత్ర.. 

ఉప్పులూరులో చెన్నకేశవ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పల్నాడు యుద్ధంలో కీలకపాత్ర పోషించిన బ్రహ్మనాయుడి అనుచరుల్లో కన్నమ్మదాసు ఒకరు. ఆయన గుణగణాలకు ముగ్ధుడైన బ్రహ్మనాయుడు మాచర్ల, మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయాల్లో అర్చకత్వ బాధ్యతలు అప్పగించారు. తరువాత వారసుడైన తిరువీధి నారాయణదాసు ఆ బాధ్యతలు తీసుకున్నారు. యుద్ధం కారణంగా నారాయణదాసు చెన్నకేశవస్వామి విగ్రహాన్ని సింహాచలానికి తరలించి కొన్నాళ్ల పాటు అక్కడ ఆశ్రయం పొందారు. పల్నాడుకు తిరుగు ప్రయాణంలో ఉప్పులూరు వద్ద ఒక చెట్టు నీడలో స్వామి విగ్రహాన్ని ఉంచారు. తిరిగి విగ్రహాన్ని భుజానికెత్తుకొనేందుకు ప్రయత్నించగా ఏ మాత్రం కదలలేదు. ఎంతమంది ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో స్వామి మహత్యంగా భావించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నారాయణదాసు కుటుంబ సభ్యులే అర్చకులుగా స్వామికి నిత్యసేవలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ 1280లో శ్రీ లక్ష్మి చూడికుడుత్త నాచ్చియార్‌ ఆండాళ్‌ సమేతంగా చెన్నకేశవస్వామి వెలిసినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 1335లో కందాల కృష్ణమాచార్యులు ఆలయాన్ని నిర్మించారు. తరువాత దశలవారీగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 1895 నుంచి స్వామి వారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. 

11 తరాలుగా.. నారాయణదాసు కుటుంబానికి చెందిన 11వ తరం వారసులు ప్రస్తుతం ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. వారిలో వీధి రామకేశవదాసు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఆయన ఆలయ చరిత్ర, స్థల పురాణాన్ని రచించి భావితరానికి అందుబాటులో ఉంచారు. పూజారుల వంశ చరిత్రను కేశవదాసు రచించారు.