తెలుగు రాష్ట్రాలలో ఉన్నవారు చాలామంది నవగ్రహ క్షేత్రాలకు వెళ్లాలంటే తమిళనాడు వెళ్లాలి, తమిళనాడులోనే నవగ్రహ క్షేత్రాలు చూడాలని చెబుతారు. కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా నవగ్రహ సంబంధిత క్షేత్రాలు చాలా ఉన్నాయి.
కుజ గ్రహ క్షేత్రాలు
కుజగ్రహ దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఏకాదశరుద్రులులలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామి క్షేత్రాలు చాలాచోట్ల ఉన్నాయి. ఆంజనేయస్వామి రుద్ర స్వరూపుడు కనుక, సాధ్యమైనంతవరకు ఆంజనేయస్వామి క్షేత్రాలని దర్శించాలని పండితులు తెలియచేస్తున్నారు.
మనకు చేరువలో ఊరిలోనే దక్షిణాభిముఖం, ఎరుపు రంగు ఉన్న ఆంజనేయస్వామిని (దక్షిణ దిక్కు కుజుడు కాబట్టి..) దర్శించాలి.
ఆంజనేయ స్వామి క్షేత్రాలు.
గుంతకల్ దగ్గరలో ఉన్న కసాపురంలో, విజయవాడ పక్కనే ఉన్న సీతానగరం, వినుకొండలో గుంటి ఆంజనేయ స్వామి, గుంటూరు జిల్లా పొన్నూరులో అత్యంత పెద్దదైన పొడవైన ఆంజనేయ స్వామి, పావులూరు ఆంజనేయ స్వామి, ఇంకొల్లులో ఆంజనేయస్వామి, విజయవాడ మాచవరంలో సమర్థ రామదాసు స్వామి క్షేత్రం, అన్నిటికంటే ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర సింగరకొండలో ఆంజనేయస్వామి క్షేత్రం, కాణిపాకం దగ్గర అర్ధగిరిలో ఆంజనేయస్వామి క్షేత్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆంజనేయ స్వామి క్షేత్రాలు చెప్పనక్కరలేదు. చాలాచోట్ల ఉన్నాయి. ఈ క్షేత్రాలను మంగళవారం రోజున దర్శించినట్లయితే మరింత ఫలితాలను పొందుతారు.
కుజ దోషాలు పోగొట్టుకోవడానికి ఆంజనేయస్వామితో పాటు వీరభద్రుడిని కూడా పూజించమని పెద్దలు చెప్తారు.
వీరభద్ర క్షేత్రాలు
వీరభద్ర క్షేత్రాలలో చెప్పుకోదగ్గ క్షేత్రం కురవి. ఈ క్షేత్రానికి మహబూబాబాద్ నుండి వెళ్లాలి. ఖమ్మం నుంచి కూడా వెళ్ళవచ్చు. ఆ క్షేత్రంలో స్వామికి సోమవారం రోజు విశేషంగా పూర్ణాభిషేకం నిర్వహిస్తారు. మిగిలినరోజుల్లో కూడా అభిషేకాలు చేస్తారు.
వరంగల్ దగ్గర ఉన్న బొంతపల్లిలో, పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో, కడప దగ్గర రాయచోటిలో అద్భుతమైన వీరభద్ర క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదు బర్కత్ పురాలో వీరభద్ర స్వామి క్షేత్రాన్ని దర్శించవచ్చు. వీరభద్రుడిని దర్శిస్తే కుజదోషాలు నివృత్తి అవుతాయి. మంగళవారం రోజు వీరభద్రుడి అష్టోత్తరంగాని, అభిషేకంకాని చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.