రథసప్తమిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.
వాహన సేవలు ఇలా...
ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.