సంక్రాంతి 2023: బొమ్మలకొలువు ఎందుకు పెడతారు? గొబ్బిళ్ళ విశిష్ఠత ఏమిటి?

బొమ్మల కొలువు అనగానే మనకు రెండు పండగలు తలపుకు వస్తాయి. ఒకటి దసరా, రెండు సంక్రాంతి. ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు. ఈ బొమ్మల కొలువు ఎవరు పెడతారు? ఎలా పెడతారు? తెలుసుకుందాం. 

ఆడపిల్ల గల కుటుంబంలో తల్లి ఆమె చేత ఈ బొమ్మలు పెట్టిస్తారు. ఇంట్లో పెద్దలందరూ పూనుకొని బొమ్మలనుఒక క్రమంలో మెట్లు మెట్లుగా అమర్చిపెడతారు. చెక్కతో మెట్ల బల్ల చేయించి పెట్టుకుంటారు కొందరు. బొమ్మల బల్ల అనీ మెట్ల బల్ల అనీ దాన్ని వ్యవహరిస్తారు. ఈ బల్ల మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. మూడు, ఐదు, ఏడు... ఇలా వారి వారి బొమ్మల సంఖ్యను బట్టి అన్ని మెట్లుగా బల్ల ఉంటుంది. బొమ్మలు పెట్టేముందు బల్లను కేవలం తెల్లటి గుడ్డతోనే కప్పుతారు. ఆ బల్ల మీద మామూలు రోజుల్లో పుస్తకాలు తప్ప ఏమీ పెట్టనివ్వరు కొందరు. మరికొందరు ఆ బల్లను గుడ్డ కప్పి పదిలంగా దాచిపెడతారు.

ముందుగా నాడు బొమ్మలు పెట్టే గది కడిగి ముగ్గు పెట్టి, బొమ్మల బల్ల కడిగి పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి పడమటి ముఖంగా కాని, ఉత్తరముఖంగా కాని బల్లను పెడతారు. బల్లలు లేనివాళ్ళు, పెట్టెలు, పుస్తకాలు, సీనారేకు డబ్బాల వంటి వాటిని మెట్లుగా అమర్చి, తెల్లటి గుడ్డ పరచి బొమ్మల కొలువు పెట్టడానికి ఆసనాలు ఏర్పాటు చేస్తారు. వర్జ్యం గాని దుర్ముహూర్తం గాని లేకుండా చూసి పసుపు వినాయకుణ్ణి చేసి మొదటి మెట్టు మీద చిన్న పళ్ళెంలో బియ్యం పోసి తమలపాకు మీద పెట్టి, దీపం పెట్టి పూజ చేస్తారు. ఆ పూజ అయ్యాక అసలు కొలువు పెట్టడం ఆరంభిస్తారు. ఇంటి ఆచారాన్ని బట్టి  పార్వతీ పరమేశ్వరులను గాని, సీతారాములను గాని, రాధాకృష్ణులను గాని, లక్ష్మీ సరస్వతులను గాని పెట్టిస్తారు, ఆ ఇంటి అమ్మాయి చేత. ఆ అమ్మాయి మొదటి దేవతామూర్తిని పెట్టాక, ఆ యేడు కొన్న కొత్త బొమ్మను తల్లి కూడా పట్టుకుని పెట్టిస్తుంది. ప్రతీ ఏడు ఒక కొత్త బొమ్మ తప్పనిసరిగా కొనడం ఆచారం. బొమ్మల ఆకారాన్ని బట్టి ఏ మెట్టు మీద ఏ బొమ్మ పెట్టాలి అనేది నిర్ణయించుకుని క్రింద నుండి పైకి పెట్టుకుంటూ వెళతారు. ప్రతి మెట్టు మీద కనీసం ఒక్క బొమ్మ క్రింద నుండి పై మెట్టు దాకా పెట్టాక తక్కిన బొమ్మలు పేర్చుకుంటూ వస్తారు.

దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, పచారీ కొట్టు కోమటి, అతని భార్య, తల్లీ పిల్ల, ఆవూ దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు... ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశనాయకుల బొమ్మలు, పురాతన కట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మల వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి.

బొమ్మలకొలువు పేరంటం

ఈ క్రమం లోనే, కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశదేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తి లోకి వచ్చింది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పార్క్ వంటివి కళాత్మకంగా ఇంట్లో వారందరూ కలిసి కట్టి పెట్టడం పిల్లలలో సృజనాత్మకత పెంపొందించే విధంగా ఉంటున్నాయి. ఆవాలు, మెంతులు వంటివి మట్టి మూకుళ్ళలో గాని, ఇసుక దిబ్బల మీద గాని జల్లి మొక్కలు మొలిపించి వాటితో చిన్న చిన్న పార్కులు కట్టడం వంటివి మారుతున్న కాలంతో పాటు బొమ్మల కొలువులోకి వచ్చి చేరిన వేడుకలు. తాము స్వయంగా చేసిన బొమ్మలు, అల్లిన బొమ్మలు ఉదా. ఏలకుల తొక్కలతో, ఇంజెక్షన్ సీసాలతో, రకరకాల మూతలతో మందిరాలు, గోపురాలు కట్టడం, వాటిని బొమ్మల కొలువుల్లో అలంకరించడం ఒక కళ.

అందంగా, కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధు మిత్రులను పిలిచి తొమ్మిది రోజులూ పేరంటం చేస్తారు. పేరంటానికి పిల్లలూ పెద్దలూ కూడా వస్తారు. బొమ్మలకు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు. అరటి పళ్ళు గాని, కొబ్బరి ఉండలు గాని, పప్పు బెల్లాలు, అటుకులూ బెల్లం గాని, సాతాళించిన శనగలు గాని, రోజుకో రకం ప్రసాదాలు పెడతారు. పిల్లలందరి చేత పాటలు, పద్యాలు పాడిస్తారు. భజన చేయిస్తారు. ముత్తైదువలకు తాంబూలం ఇస్తారు. ప్రతిరాత్రి బొమ్మలకు పవళింపు సేవ చేస్తారు. పేరంటం అంతా అయిపోయాక హారతి ఇచ్చి ఏదో ఒక బొమ్మను పడుకోబెట్టి నిద్ర పొమ్మని తలుపులు వేసేస్తారు. మరునాడు పొద్దుటే ఆ బొమ్మకు మేలుకొలుపు పాడి నిద్ర లేపే పూజ చేస్తారు.

సంక్రాంతి గొబ్బిళ్ళు

ఆంధ్రులకు సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ వచ్చేముందు ధనుర్మాసంలో ముప్ఫై రోజులూ కన్నెపిల్లలు ఉషఃకాలంలో ఆవుపేడతో గొబ్బిళ్ళు చేసి పూజ చేస్తూ సంక్రాంతికి స్వాగతం పలుకుతారు. దసరా రోజుల్లో కన్నెపిల్లలకు పూజ, సంక్రాంతి నాళ్ళలో గొబ్బిళ్ళకు పూజ, కన్నెపిల్లలు కుటుంబ వృద్ధి కోసం, ఉత్తమ వరుని కోసం చేస్తారు. గొబ్బిళ్ళ పాట గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలియవస్తుంది.

సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యవే

తామర పువ్వంటీ తమ్ముణ్ణియ్యవే

చేమంతి పువ్వంటీ చెల్లెల్నియ్యవే

మొగలీ పువ్వంటి మొగుణ్ణియ్యవే

అని బాలికలు గొబ్బెమ్మను ప్రార్థిస్తుంటారు. తనకు తమ్ముడు, చెల్లెలు కలగాలని, మంచి భర్త రావాలని, ‘సుబ్బడు,’ అంటే పిల్లవాడు కలగాలనీ కోరుకుంటున్నారు. ఇక పెద్దలు సంకురమయ్యకు స్వాగతం పలికి పూజించడం సంక్రాంతి పండుగలో ప్రధాన అంశం.

ఈ సంకురమయ్య ఎవరు?

ప్రతి సంక్రాంతికీ కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగివచ్చి భూలోక వాసులనందరినీ పరిపాలిస్తాడు. ప్రతి సంవత్సరం, అతని వాహనం, అతని పరివారం మారిపోతూ ఉంటాయి. ఆ సంక్రాంతి పురుషుణ్ణే సంకురమయ్య అంటారు. అతడే ఈ చరాచర జగత్తునూ నడిపిస్తూ ఉంటాడు. ఆయనను స్వాగతిస్తూ, అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలమే. ఈ బొమ్మలను రక్షించే భారం నీదే సుమా, అని సంకురమయ్యకు విన్నపం చేసేందుకే ఈ బొమ్మల కొలువు అని చెప్పుకుంటారు.

ఆ విధంగా సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో ప్రధాన దైవం సంకురమయ్య. పసుపు వినాయకుడిని పూజించాక, పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురమయ్యగా సంభావించి, ఆహ్వానం పలికి, పూజిస్తారు. ఆ తరువాత తక్కిన బొమ్మలు పెడతారు. ముఖ్యంగా సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం ఈ బొమ్మల కొలువు పెడతారు. వినాయకుడితో, కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు. పిల్లవాడిని ఎత్తుకున్న తల్లిబొమ్మ కూడా తప్పకుండా పెడతారు. మిగతా వివరాలలో దసరా బొమ్మల కొలువు పద్ధతినే పాటిస్తారు. భోగినాడు పెట్టి, కనుమ రోజున కొలువు ఎత్తేస్తారు. అలా మూడు రోజులే ఉంటుంది ఈ కొలువు. సంక్రాంతి రోజు ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమలు, తాంబూలం, ముత్తైదువలకు తప్పనిసరిగా ఇస్తారు. ధనుర్మాసం నడిపించిన గోదాదేవి బొమ్మ కూడా తాంబూలంలో ఇస్తారు.

సంకురమయ్య బొమ్మలు కుమ్మరి వారు ప్రత్యేకంగా చేసి మోతుబరి రైతులకు బహుమానంగా ఇచ్చేవారనీ, వీధుల్లోకి తెచ్చి మిగతా బొమ్మలతో పాటుగా అమ్మేవారనీ, ప్రస్తుతం ఆ బొమ్మల తయారీ కానీ, అమ్మకం కానీ, జాడ కానీ లేదు. 

అష్టకర్ణో విశాలాక్షో లంబభ్రూ దీర్ఘనాసికః

అష్టబాహుశ్చతుర్వక్త్ర సంక్రాంతి పురుషస్మృతః

సంక్రాంతి పురుషునకు నాలుగు ముఖాలు, ఎనిమిది భుజాలు, ఎనిమిది చెవులు, విశాలమైన కళ్ళు, వ్రేలాడే కనుబొమ్మలు, పొడుగాటి ముక్కు ఉంటాయి.

బొమ్మలన్నీ పెట్టెల్లో పాత పట్టుగుడ్డలు (బొమ్మ పొత్తికలు) చుట్టి దాచడం ఒక పని, ఒక కళ. బొమ్మలకు ప్రత్యేకం చెక్కపెట్టెలు ఉండి, బొమ్మల పెట్టెలు ఆడపిల్లలకు బొమ్మలతో సహా సారె పెట్టే ఆచారం ఉండేది. బొమ్మల కొలువు పెట్టేందుకు బొమ్మల పెట్టె తెరవడం ఒక సంబరం. పెట్టెకు పెద్దవాళ్ళు, మగవాళ్ళు తండ్రి, పినతండ్రి పూజ చేసి, హారతి ఇచ్చి, ధూపం వేసి, అమ్మల గన్న యమ్మ పద్యం పిల్లలతో పాడించి జయజయధ్వానాలతో పెట్టె మూత తీయడం, పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టడం అదో అపురూపమైన వేడుక. ఇలాంటి వేడుకలెన్నో ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.