ప్రొద్దుటూరు లో డిసెంబరు 18న శ్రీనివాస కల్యాణాలు

కర్ణాటక రాష్ట్రం రామనగర లోని డిస్ట్రిక్ట్ స్టేడియంలో డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీనివాసకల్యాణం నిర్వహించనున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమార స్వామి సౌజన్యంతో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు.

వేలాదిమంది భక్తులు పాల్గొనేలా రామనగర డిస్ట్రిక్ట్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ అధికారుల పర్యవేక్షణలో కళ్యాణ వేదిక నిర్మాణం, విద్యుత్ అలంకరణల పనులు జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు స్థానిక అధికారులసమన్వయంతో అవసరమైన పనులు చేపట్టారు. బ్యారికేడ్లు, విఐపిల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తులు కూర్చునేందుకు చేయాల్సిన పనులు ప్రారంభించారు. 

18న ప్రొద్దుటూరులో…

వై ఎస్ ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ హైస్కూలు మైదానంలో డిసెంబరు 18వ తేదీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన గోవిందమాల భక్త బృందం టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. టీటీడీ అధికారుల సూచనల మేరకు వేదిక, విద్యుత్, బ్యారికేడ్ల నిర్మాణం పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వేలాదిమంది భక్త బృందం సమక్షంలో కన్నుల పండువగా కల్యాణం నిర్వహించనున్నారు.