శ్రీ వ‌కుళామాత‌ ఆలయ మహాసంప్రోక్షణ

తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద  పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు 18వ తేదీ శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. జూన్ 23వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

కాగా, శనివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు శోభాయాత్ర‌ వేడుకగా జరిగింది. రాత్రి 7.30 గంట‌ల‌కు పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. 

క్షీరాధివాసం

శ్రీ వ‌కుళామాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా 20వ తేదీ సోమ‌వారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు, న‌వ‌క‌ల‌శ‌ స్న‌ప‌న క్షీరాధివాసం నిర్వ‌హించారు. అమ్మ‌వారి విగ్ర‌హ‌నికి వేద మంత్రాల మ‌ధ్య పాల‌తో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయ‌డం వ‌ల్ల దోషాలు తొల‌గిపోతాయ‌ని అర్చ‌కులు తెలిపారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు క‌ల‌శారాధ‌న‌, విశేష హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 

జలాధివాసం

శ్రీ వ‌కుళ‌మాత అమ్మ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా  మంగ‌ళ‌వారం ఉదయం జ‌లాధివాసం నిర్వహించారు.

ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు, చ‌తుర్ద‌శ క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం శ్రీ వ‌కుళ‌మాత అమ్మ‌వారి విగ్ర‌హానికి జ‌లాధివాసం నిర్వ‌హించారు. అమ్మ‌వారి విగ్ర‌హానికి వేద మంత్రాల మ‌ధ్య మంత్రించిన జ‌లంతో విశేషంగా ప్రోక్ష‌ణ (జ‌లాధివాసం) చేయ‌డం వ‌ల‌న విగ్ర‌హంలో ఎలాంటి దోషాలు ఉన్నా, తొల‌గి ప్ర‌తిష్ట‌కు యోగ్యం అవుతుంద‌ని అర్చ‌కులు తెలిపారు. త‌రువాత కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు చేపట్టారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు క‌ల‌శారాధ‌న‌, విశేష హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.