ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ గత మూడు సంవత్సరాలుగా టీటీడీ వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 25 నుండి జులై 10వ తేదీ వరకు తిరుమల వసంత మండపంలో రామాయణంలోని అరణ్యకాండ పారాయణ దీక్ష చేపట్టనున్నారు.
కరోనా మహమ్మారి నుంచి లోకాన్ని కాపాడాలని స్వామిని ప్రార్థిస్తూ ఇప్పటికే షోడశదిన సుందరకాండ దీక్ష రెండు సార్లు, అఖండ సుందరకాండ పారాయణం, బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ పారాయణం నిర్వహిస్తున్నారు. కోట్లాది మంది భక్తులచే మంత్ర ఉచ్ఛారణ చేయిస్తున్నారు. అరణ్యకాండలో శ్రీరాముడు రాక్షస గుణాలను నశింపచేసి ఋషులకు రక్షణ కల్పించాడు. దీన్నే మోక్ష కాండ అని కూడా అంటారు. ప్రతి ఇంట్లో పారాయణం చేయడం ద్వారా మంత్రపూరితమైన శ్లోకాల శబ్ద తరంగాలు అక్కడి వాతావరణాన్ని పునీతం చేస్తాయనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు టీటీడీ ఈ కార్యక్రమాలు చేపడుతోంది.
రాక్షస గుణాలు తొలగుతాయి
రామాయణంలోని మొత్తం 24 వేల శ్లోకాలను పారాయణం చేయాలని టిటిడి సంకల్పంగా పెట్టుకుంది. ఇప్పటివరకు బాలకాండ, సుందరకాండ, అయోధ్యకాండ పారాయణం పూర్తయింది. ఇప్పుడు అరణ్యకాండలోని 75 సర్గల్లో ఉన్న 2,454 శ్లోకాలను పారాయణ చేస్తారు.ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయని పెద్దలు చెబుతున్నారు. ‘‘రామస్యపాదౌజగ్రాహలక్ష్మణస్యచధీమతః’’అనే మంత్రంలోని అక్షరక్రమం ప్రకారం టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో ఆయా సర్గల్లోని శ్లోక పారాయణం జరుగుతుంది. అరణ్యకాండ పారాయణ దీక్షకు జూన్ 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ జరుగనుంది.. తిరుమలలోని వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 16 మంది వేద, శాస్త్ర పండితులతో పారాయణదీక్ష చేపడతారు.. అలాగే మరో 16 మంది పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో జప, తర్పణ, హోమాదులు ప్రతి శ్లోకానికీ నిర్వహిస్తారు.