ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించ నున్నారు. దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి సంఘ జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడిన నేపధ్యంలో వరుసగా రెండేళ్ళ పాటు సత్యదేవుని కల్యాణాన్ని భక్తులు లేకుండా కేవలం ఆలయం సిబ్బంది సమక్షంలో అతి సామాన్యంగా నిర్వహించారు.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెమ్మదించిన నేపధ్యంలో ఈ ఏడాది సత్యదేవుని కల్యాణం భక్తులు, ప్రజల సమక్షంలో జనరంజకంగా నిర్వహించాలని నిర్ణయించారు.
కళ్యాణోత్సవాలకు శ్రీకారం
అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి మండపంలో ఆశీనులను గావించారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం రాత్రి 9 గంటల నుంచి సత్యదేవుడి తిరు కల్యాణ మహోత్సవం జరగనుంది. వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరిపిస్తారు.