ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు యోగ సారాన్ని అందించడం ద్వారా ఆయురారోగ్యాలు కలిగిన మంచి సమాజం రూపొందాలనే ఉద్దేశ్యంతో కోట్లాదిమంది మన్ననలు పొందిన విష్ణు సహస్రనామ పారాయణం ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం తిరుమల నాద నీరాజనం వేదికపై పతాంజలి యోగదర్శనం టిటిడి ప్రారంభించింది.
గత రెండు సంవత్సరాలుగా టిటిడి నిర్వహించిన సుందరకాండ, సకల కార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణం, యుద్ధకాండ, బాల కాండ, విరాటపర్వం, గీతా పారాయణ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన యోగ దర్శనం కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించింది. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ప్రసారమవుతున్న యోగదర్శనం 45 నిమిషాలు, భగవద్గీత శ్లోక పారాయణం 15 నిమిషాలు నిర్వహిస్తారు. అదేవిధంగా గరుడ పురాణం, సభా పర్వం, అరణ్యపర్వం వంటి ఇతర పారాయణ కార్యక్రమాలు ఒకటి పూర్తయిన తర్వాత ఒకటి ప్రారంభమవుతాయి.
భారతదేశం కర్మ, జ్ఞాన, భక్తి, యోగ భూమి అని, పతాంజలి యోగ శాస్త్రం వ్యక్తి, పరమాత్మ, జగత్తుగురించి తెలుపుతుందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ రాణి సదాశివమూర్తి వివరించారు. జీవికి పరమాత్మునికి మధ్య ఉన్న సంబంధం నుండి యోగ శాస్త్రం ఉద్భవించిదని తెలిపారు. కర్మ యోగి, జ్ఞాన యోగి, భక్తి యోగి కావాలంటే యోగ శాస్త్రం వల్ల సిద్ధిస్తుందని చెప్పారు. భగవంతుని చేరుకోవాడానికి ఉన్నదర్శనాలలో యోగ దర్శనం ఒకటని, యోగ దర్శనం ద్వారా మనవల్ని మనం సంస్కరించుకుని ఎలా ముక్తిని పొందాలి అనే అంశాలు యోగ శాస్త్రం తెలియజేస్తోందని వివరించారు.
తరువాత జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాధ శర్మ ప్రవచనాలు, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతీ శ్లోక పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.