తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
శ్రీరామనవమి ఆస్థానం
అనంతరం రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు.