మ‌హా పూర్ణాహూతితో ముగిసిన‌ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగం

 

తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న‌ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగం బుధ‌వారం ఉద‌యం మ‌హా పూర్ణాహూతితో శాస్త్రోక్తంగా ముగిసింది.

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాల‌తో, సిరి సంప‌ద‌ల‌తో ఉండాల‌ని మూడు రోజుల పాటు టిటిడి ఈ యాగం నిర్వహించింది.  రుత్వికులు వైఖాన‌స ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఏడు హోమగుండాల‌లో హోమాలు, మంత్ర పారాయ‌ణం నిర్వహించారు. చివ‌రిగా మంత్ర శ‌క్తితో నిండిన క‌ల‌శాల్లోని జ‌లంతో శ్రీ ధన్వంతరీ, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానుల‌కు అభిషేకం చేయ‌డం వ‌ల‌న లోకం అంత సుభిక్షంగా ఉంటుందని విశ్వాసం.

యాగ‌శాల‌లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, శ్రీ ధ‌న్వంత‌రి, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానుల ఉత్స‌వ‌మూర్తుల‌ను కొలువుదీర్చారు. ఇందులో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, అగ్నిస్థాప‌న‌, కుంభ‌రాధ‌న‌, కుంభ‌ నివేద‌న‌, విశేష హోమాలు, మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ ధ‌న్వంత‌రీ, సుద‌ర్శ‌న భ‌గ‌వానులకు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నం, క‌ల‌శాల్లోని మంత్ర జ‌లంతో విశేషంగా అభిషేకం చేశారు.

టిటిడి వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో 12 మంది ప్ర‌ముఖ రుత్వికులు మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వ‌హించారు.

ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, తిరుమ‌ల విజివో శ్రీ‌బాలిరెడ్డి, ఎవిఎస్వో శ్రీ గిరిధ‌ర్‌, వేద పాఠ‌శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.