శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరిగింది.
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
ఆకట్టుకున్న సీతా కల్యాణం కవి సమ్మేళనం
పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సీతా కల్యాణం పేరిట కవి సమ్మేళనం నిర్వహించారు. సీతా కల్యాణం గురించి పలు ప్రముఖ గ్రంథాల్లో విశేషంగా పొందుపరిచిన అంశాలను పండితులు తెలియజేశారు. మందరము, శ్రీమద్రామాయణం కల్పవృక్షం, గడియారం వేంకటశేష శాస్త్రివారి రామాయణం, శ్రీ భూతపురి వారి రామాయణం, మొల్ల రామాయణం, రామచరిత మానస్, పోతన భాగవతంలోని అంశాలపై పలువురు పండితులు కవి సమ్మేళనం నిర్వహించారు.