శ్రీ సీతారామలక్ష్మణుల విహారం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు 13వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి అలంకారంలో...
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
మూడోరోజు మలయప్ప స్వామిగా...
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.