మోహినీ గరుడ వాహనసేవల్లో భక్తులను అలరించిన శ్రీ కోదండరాముడు

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో కనువిందు చేశారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో ఏర్పడిన కలహాన్ని నివారించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తారు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరని, ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.

గరుడ వాహనంపై వైకుంఠ రాముడు

బుధ‌‌వారం రాత్రి గరుడ వాహనం వాహనంపై స్వామివారు అభ‌య‌మిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు. నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడు. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

Source