శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్ర‌వారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.





అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ త‌రువాత స్నపనతిరుమంజనం వేడుక‌గా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.





వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.





కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించారు.





శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ





తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శ‌నివారం ఉద‌యం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.





ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ త‌రువాత స్నపనతిరుమంజనం వేడుక‌గా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, చందనంతో అభిషేకం నిర్వహించారు.





అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.





Source