పుష్కరవాహిని నది పుష్కరాలు 2019: పుష్కర నదీ ప్రాశస్త్యం


ప్రాచీన ఆర్ష విద్య, సభ్యతా సంస్కృతులకు, సనాతన సంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి ఉన్న భారతావనిలో ప్రతి జీవిలో దైవాన్ని దర్శించి, పూజించడం సదాచారంగా వస్తున్నది. అందులోభాగంగానే పంచ మహా భూతాలలో ఒకటిదైన నీటికి ప్రాధాన్యత ఇస్తూ, జీవనదులను ఆరాధించడం పరంపరానుగతంగా వస్తున్నది. పుష్కరం అంటే 12ఏళ్ళు. 12ఏళ్ళకు ఒకసారి ఒక నదికి పుష్కరం రావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే 12నదులకు సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రదాయం ఆచరణలో ఉంది.





మేషే గంగా వృషే రేవా మిథునే చ సరస్వతీ |
కర్కటే యమునా ప్రోక్తా సంహే గోదావరీ స్మృతా |
కన్యాయాం కృష్ణవేణీ చ కావేరీ ఘటకే స్మృతా |
వృశ్చికే తమ్రవర్ణీ చ చాపే పుష్కర వాహిని ||
మకరే తుంగభద్రా చ కుంభే సింధునదీ స్మృతా |
మీనే వ్రణీతా చ నదీ గురోస్సంక్రమణే స్మృతా ||
పుష్కరాభ్యో మునీనాం హి ప్రదేశో2త్ర బుధైః స్మృతః |





ఈ శ్లోకం ప్రమాణం ప్రకారం బృహస్పతి పుష్కరునితో కలిసి మేషరాశిని ప్రవేశించినప్పుడు గంగకు పుష్కరం, వృషభారాశిలో నర్మదకు, మిధునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహలో గోదావరికి, కన్యలో కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరధికి, ధనస్సులో పుష్కర వాహినికి, మకరంలో తుంగభద్రకు, కుంభంలో సింధుకు, మీనంలో ప్రణితానదికి పుష్కరాలు సంభవిస్తాయి. ఈ ఏడాది(2019) నవంబరు ఐదవ తేదీ నుంచి పుష్కరవాహిని నదికి పుష్కరాలు జరుగుతున్నాయి.









పుష్కరవాహిని ప్రాశస్త్యం ఏమిటి?





పద్మ పురాణంలో చెప్పబడిన కథను అనుసరించి పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రహ్మ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుధంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట. ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మధ్య పుష్కర్, చివరిది కనిష్ఠ పుష్కర్. బ్రహ్మ చేతి (కర) లోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు వచ్చింది.





సంస్కృతంలో పుష్కర్ అంటే నీలి తామర పుష్పము. హిందువులు దేవునిచేత పంపబడిన హంస ముక్కు నుండి కిందకు జారిన తామరపుష్పము బ్రహ్మయజ్ఞము చేసిన ప్రదేశములో ఏర్పడిన సరస్సు కనుక దానికి పుష్కర్ అనే పేరు వచ్చినదని విశ్వసిస్తున్నారు. పుష్కర్ అనే పదము పుష్కరిణి అనే పదము నుండి వచ్చిందని అంచనా. పుష్పము అంటే పువ్వు కర అంటే చేయి చేతి నుండి జారిన పువ్వు వలన ఏర్పడిన సరస్సు కనుక పుష్కర్ అయ్యిందని విశ్వసిస్తున్నారు.





పుష్కర్ నది ఎక్కడ ఉంది?





భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్. అది అజ్మీరు జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673) అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. అక్కడి సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉంది.