తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన శనివారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బ ందాల చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.
భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు,మదమోహ, మాత్సర్యాదులు సంహరింపబడుతాయి. అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు గజవాహనం వైభవంగా జరుగనుంది. ఆద్యంతరహితుడైన శివదేవుని, ఐశ్వర్యసూచికమైన గజవాహనంపై దర్శించడం కోటిజన్మల తపఃఫలం.