సౌభాగ్యాన్ని ప్రసాదించే సిరులతల్లి ‘‘శ్రీ కనక మహాలక్ష్మి’’ అమ్మవారు

మార్గశిరమాసం అంటే అనేక నోములు, వ్రతాలు, పూజలకు ఆలవాలమైనది. ఈ మాసంలో గురువారం ప్రత్యేకమైనది. మార్గశిర లక్ష్మివారం రోజున ఆ సిరులతల్లి మహాలక్ష్మిని సేవించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.  విశాఖపట్నం నగరంలోని బురుజుపేటలో వెలసిన " శ్రీ కనక మహాలక్ష్మి" అమ్మవారు ఆరోగ్యాన్ని, స్త్రీ లకు సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా భాసిల్లుతున్నారు.

గోపురం లేని ఆలయం


శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాలలో వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇదీ ఈ అమ్మవారి ప్రత్యేకత. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజులపాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని తెలుస్తోంది. విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి.

ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారే ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా  అమ్మవారికి పసుపు ,కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.

గురువారం ప్రీతికరమైన రోజు


అమ్మవారి సేవలకు " గురువారం " ప్రీతికరమైన రోజు. ఆ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి , తీర్థ, ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు.

ప్రతి ఏటా మార్గశిర మాసం నెలరోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు.

ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా, ఇరుగు, పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు.

ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా కనిపిస్తుంది. రథోత్సవం, వేదపండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చివరి గురువారం అన్న ప్రసాద వితరణను జరుపుతారు. మార్గశిరమాసం సందర్భంగా మీరూ ఆ కనకమహాలక్ష్మిని సందర్శించి తరించండి.