మోహినీ గజ వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కరుణించిన సిరులతల్లి

తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారంతో 5 వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మోహిని రూపంలో అలివేలుమంగ పల్లకిలో తిరువీధులలో విహరించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు

గజవాహనసేవ


ప్రతి సంవత్సరమూ జరిగే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో, గజవాహన సేవలో భాగంగా అమ్మకు అలంకరించే స్వామివారి కాసుల హారం ఏడు కొండలూ దిగివచ్చింది. ఈ కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. నిత్యమూ స్వామి మెడలో ఉండే కాసుల హారం, ఈ ఒక్కరోజే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అలంకరిస్తారు.

తిరుమలలో తిరుమాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం తిరుమల నుంచి తిరుచానూరుకు హారాన్ని తరలించారు. సాయంత్రం పద్మావతీ దేవికి జరిగే గజ వాహన సేవ సమయంలో ఈ హారాన్ని అలంకరిస్తారు. తిరుమలలో గరుడోత్సవానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, తిరుచానూరులో గజవాహన సేవకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, అమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ.