తిరుమలలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 19న ద్వాదశి పర్వదినాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తెలిపింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల గరుడసేవ తరువాత వైకుంఠ ఏకాదశికి తిరుమలకు ఎక్కువ మంది భక్తులు వస్తారు. వీరందరికీ అన్ని వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు టిటిడి చేస్తోంది. డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల తరువాత నుండి భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి పంపుతారు. అక్కడ దాదాపు 28 గంటలు భక్తులు వేచి ఉండాల్సి వస్తుంది. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు చలికి ఇబ్బందులు పడకుండా ఈసారి మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటుచేశారు.
భక్తులను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్- 2, వైకుంఠం క్యూకాంప్లెక్స్- 1లోకి అనుమతిస్తారు. అవి నిండిన తరువాత వరుసగా ఆళ్వార్ ట్యాంక్ లైన్, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలోకి పంపుతారు. తరువాత మేదరమిట్ట వద్ద గల ఎన్1 గేటు ద్వారా మాడ వీధుల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షెడ్లలోకి అనుమతిస్తారు. షెడ్ల వద్ద తాగునీరు, అన్నప్రసాద వితరణ, మరుగుదొడ్ల వసతి కల్పించారు.
అన్ని ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బంది వివరాలతో క్షేత్రస్థాయిలో ఏర్పాటుచేశారు. టి కెట్ కౌంటర్లు, క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఎక్కడా భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. గతేడాది ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 1.70 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈసారి భక్తులు ముందుగా తిరుమలకు వచ్చి ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి కోరింది.
Source