‘‘మహాత్మా! మా పితృదేవతలందరికీ సద్గతులు కలగాలంటే వారి భస్మరాశి గంగాజలంతో తడవాలి. అయితే ఆకాశము నుండి పడుతున్న గంగా ప్రవాహమును భూమి భరించలేదు. కాబట్టి మీరు గంగను ధరించ ప్రార్థన’’ అని అనెను. దానికి ఈశ్వరుడు అంగీకరించి గంగను తన శిరస్సు(జటలయందు) ధరించి బయటికి వదలెను. ఈ విధంగా శివుని శిరము నుండి భూమిపై పడిన గంగ ఏడు పాయలుగా చీలింది. అవి నళిని, హ్లాదిని, ప్లావని, సీత, చక్షుస్సు, సింధు, భాగీరథి అనునవి.
వీటిలో సింధు నది వాయవ్యముగాను, పడమరగాను తరువాత దక్షిణముగాను ప్రవహించి పశ్చిమ సముద్రములో కలుస్తోంది. ప్రపంచంలో అతి పొడవైన నదులుగా చెప్పబడే వాటిలో సింధునది ఒకటి. దీని మొత్తం పొడవు సుమారుగా 2880 కిలోమీటర్లు. ఈ నదీమూలం కనుక్కోవడం కష్టం. కైలాసపర్వతపు ఉత్తర భాగంలో టిబెట్ ప్రాంతంలోని మంచుకొండల్లో 17000 అడుగుల ఎత్తున సింధు మొదలవుతుంది.
సింగెఖంబా(సింహపునోరు) అనే చోట సింధు వాహిని మొదటిసారిగా దర్శనమిస్తుంది. ‘‘సింహపునోరు’’ మాసనసరోవరం దగ్గరలో ఉంది. ఈ సింగెఖంబా నుండి బయలుదేరిన సింధునది మనదేశపు లడక్, కాశ్మీరు ప్రాంతాలలోను, పాకిస్తాన్ లోను ప్రవహించి కరాచీకి తూర్పున అరేబియా సముద్రంలో విలీనమవుతుంది.
సింధునదికి ఉపనదులు ఎక్కువ
భారతదేశపు నదులలో అన్నింటికంటే సింధునదికి ఎక్కువ ఉపనదులున్నాయి. ఈ నదులన్నీ నిరంతరం ప్రవహించే జీవనదులవడం వలన ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి.
‘లే’ నగరం సమీపంలో సింధునదిలో జ(0) స్కార అనే నది వచ్చి కలుస్తోంది. జంస్కార్ అన్న పదం ఇక్కడ దొరికే తామ్ర ఖనిజం నుంచి పుట్టింది. మట్టి రంగులో ఉండే సింధుజలాలు రాగి కలిసిన జంస్కార్ నీలిరంగు నీటిలో కలుస్తాయి. కొన్ని వందల గజాల వరకూ ఈ రెండు నదులు కలసిన గీత స్పష్టంగా కనిపిస్తుంది. జమ్మూకాశ్మీరు రాష్ట్రంలోని లడక్ ప్రాంతంలో ‘లే’నగరం ఉంది.
బాల్టస్థాన్ లో ప్రముఖ నగరమైన స్కర్దూ దగ్గర్లో వాయవ్యం నుంచి వచ్చే విశాలమైన నది ‘షిగర్’ సింధులో కలుస్తుంది. ఈ స్కర్దూ కాశ్మీరులోని కారకోరమ్ ప్రాంతంలో ఉంది. స్కర్దూ బేసిన్ విశాలమైన ఎడారిలోయ, ఇసుక తిన్నెలు కలిగి ఉంటుంది. ఇక్కడికి చేరేసరికి లడాక్ నీ, గ్రానైటు కనుమలనీ వదలి వచ్చిన సింధు ఒక సువిశాలమైనదిగా రూపుదిద్దుకుంటుంది. దాదాపు 160 కిలోమీటర్లు వాయవ్యదిశలో హిమాలయాల నీడలో ప్రవహించిన సింధులో ‘షయోక్’ అనే ఉపనది వచ్చి కలుస్తుంది. ఈ కలయిక స్కర్దుకి 30 కిలోమీటర్లు ఆగ్నేయంలో జరుగుతుంది.
సింధు నదిలో కలిసే మరొక నది ‘హుంజా’ . ఈ నది హరామోష్ శిఖరం పక్క నుంచి 10,000 అడుగులు కిందకి పడి నైరుతి దిశగా మలుపుతిరిగి సింధులో కలుస్తుంది. ఇక ఇక్కడ నుండి సింధు బాలిస్థాన్ లోని గిల్గిట్ నగరం చేరుతుంది. ఆఫ్ఘనిస్థాన్ దేశం పూర్వము భారతదేశంలోని గాంధార రాజ్యము. ఆఫ్ ఘని రాష్ట్రములో ప్రవహించే కాబాల్ నది హిందూకుష్ పర్వత ప్రాంతంలో జన్మించింది. పంజాబ్ కి పశ్చిమోత్తరంగా ఉన్న ‘అటక్’ పట్టణం వద్ద ఈ కాబాల్ నది సింధు నదిలో కలుస్తోంది.
‘సోహాన్’ అను ఉపనది మఖద్ వద్ద సింధునదిలో కలుస్తోంది. ఇక సింధునది యొక్క ముఖ్య ఉపనదులు రావి, బియాస్, ఝీలం, సట్లెజ్, చీనాబ్ అనునవి పాకిస్తాన్ లో సింధునదిలో కలుస్తున్నాయి. ఇవేకాకుండా సింధునదికి ఫలర్, హీరట్, కునార్, స్వాత్ మొదలగు ఉపనదులు కూడా కలవు.
సప్తసింధువు లు
సింధునదిలో కలిసే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు ప్రవహించే ప్రాంతానికి ‘పంచా అప’ (పంజాబ్) అని పేరు. పంజాబు ప్రదేశాన్నే పూర్వం ‘సప్తహిందు’ గా పిలిచేవారు. పైన చెప్పబడిన అయిదు నదులు,సింధునది, ఇప్పుడు కనబడకుండా అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ‘సరస్వతి’ నది కలిసి ’సప్తసింధువు‘ లు!
సింధునది 2880 కిలోమీటర్ల పొడవున్నప్పటికీ మనదేశంలో 709 కిలోమీటర్ల పొడవు మాత్రమే కలిగి ఉంది. అంతేకాక ఈ నదీ జలాల్ని మనం కేవలం 20 శాతం మాత్రమే వాడుకుంటున్నాం. ఈ నదీ పరీవాహక ప్రదేశం చాలావరకు పడమటి పాకిస్తాన్ లో ఉంది. (ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మనదేశంలోనే ఉండేది. స్వాతంత్య్రం తరువాత ఈ ప్రాంతం మనదేశం నుండి విడిపోయింది.) సింధునది పరీవాహక ప్రాంతం పర్వత మైదాన దశలతో సమానమని చెప్పవచ్చు.
సింధునది మైదానదశలో పంజాబు చాలా భాగము సారవంతమైన పంటనేల. పంజాబులో ప్రకృతిసిద్ధముగా వర్షము తక్కువైనప్పటికీ సింధునది, దాని ఉపనదులు జీవనదులు అవడం వల్ల నీటికి కొదవలేదు. వేసవికాలంలో నైనా హిమాలయాలమీద మంచు కరిగి నీరుగామారి ఈ నదులలోకి వచ్చి చేరుతుంది. ఈ నదుల నుండి తవ్వబడిన కాలువలు వలత్రాడు లాగా అల్లుకుని ఉన్నాయి. ఈ కాలువలు తమ నీటిని పుష్కలంగా లక్షలకొద్దీ ఎకరాల నేలకు అందిస్తున్నాయి. సింధునది, దాని ఉపనదుల చేత తీసుకొని రాబడిన ఒండ్రుమట్టిచేతను, నీటి సదుపాయముల చేతను పంజాబ్ మంచి పంటనేల అయింది. పంజాబులో గోధుమ, ప్రత్తి, వరి పంటలు విరివిగా పండుతున్నాయి.
సింధురాష్ట్రములో 1932వ సంవత్సరములో సింధునదిపై సుక్కూరు వద్ద ‘సుక్కూరు ఆనకట్ట’ ప్రారంభమైంది. ఈ ఆనకట్ట పొడవు ఒక మైలు. ఇక్కడనుండి తవ్వబడిన కాలువల మూలంగా సుమారు 56 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ ఆనకట్టకు దక్షిణమునకు వెళ్ళగా సింధురాష్ట్రములోని హైదరాబాద్ అను పట్టణం దగ్గర పాయలుగా చీలిన సింధునది సముద్రంలో కలుస్తోంది.
సింధుస్థానమే హిందూస్థాన్, ఇండియా గా మారింది
సింధునది భారతదేశంలో అతిపెద్ద నది. అందువల్లనే దేశానికి ‘సింధుస్థానం’ అన్న మరో పేరు ఏర్పడింది. ‘సింధుస్థానం’ క్రమంగా ‘హిందుస్థానం’ అయింది. ‘హిందుస్థానం’ అన్న పదాన్ని పలకడం చేతకాక, నోరు తిరగక ఆంగ్లేయులు ‘హిందుస్థానం’ అన్న పదాన్ని ‘ఇండియా’ అని ఉచ్ఛరించారు. అలాగే వారు ‘సింధునదిని’ ‘ఇండస్’ అని పిలిచారు.
ప్రపంచంలో తొలి మానవులు గంగా, సింధు, సరస్వతీ, దృషద్వతీ నదుల తీరాలలో సంచరించారు. ఆ తరువాత ‘భారతదేశం నుండి మానవులు అన్ని దేశాలకు వలసవెళ్ళారు‘.
ఆధునిక యుగంలో భారతదేశానికి వర్తక నిమిత్తం వచ్చిన యూరోపియన్లు, ముఖ్యంగా ఆంగ్లయులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత తమ వలసవాద రాజ్యభావాన్ని భారతీయులపై రుద్దే క్రమంలో ‘‘అనాదినుండి భారతీయులు తమను తాము ఎప్పుడూ పాలించుకున్నట్లుగా చారిత్రక ఆధారాలు లేవని, ఆర్యుల నుండి మొఘలు పాలకుల వరకు భారతీయులు విదేశీయుల చేతనే పాలించబడుతూ వచ్చారని, భారతీయులు తమకంటూ ఒక నాగరికతను రూపొందించుకోలేకపోయారనీ, మొఘలుల కంటే తాము ఆధిక్యత కలిగినవారం కాబట్టి భారతదేశంలో బ్రటిష్ పాలనే సరైందని’’ ప్రచారం చేస్తూ వచ్చారు.
బ్రిటిష్ వారిచే రచింపబడిన భారతదేశ చరిత్ర తప్పుడుగా, హీనంగా చిత్రీకరించబడింది. 1920లో భారతదేశ వాయవ్య ప్రాంతంలో సింధూ నదీ తీరంలో ప్రాచీన భారతదేశ నాగరికత అవశేషాలు బైటపడి, అప్పటివరకూ భారతదేశ చరిత్రపై గల కొన్ని అపోహలను పటాపంచలు చేసింది. భారతదేశంలో క్రీస్తుపూర్వం 3000 సంవత్సరానికి పూర్వమే అతి విశిష్టమైన నాగరిక, సాంస్కృతిక వ్యవస్థలు విలసిల్లాయని ఋజువైంది. భారత జాతీయ సాంస్కృతిక వ్యవస్థ అనాదిగా ఉంది. ఆ సనాతన చరిత్రకు సింధుజలాలు సజీవ సాక్ష్యాలు. ఈ వ్యవస్థలు ఉండినట్టు ‘‘ సింధునది ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో వెల్లడైంది. సింధునది ప్రాంతంలో బయటపడిన హరప్పా, మొహంజోదారో నగరాల అవశేషాలు ప్రాచీన భారతీయ వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. పుష్కరాలు వచ్చే నదులలో ఇది 11వ నది. గురుగ్రహం కుంభరాశిలో ప్రవేశిస్తే ఈ నదికి పుష్కరాలు వస్తాయి.