స్నాన మహత్యము
కార్తీకపురాణంలో నదీస్నాన మహత్యం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అధికార గర్వంతో కన్నూమిన్నూ కానక ఒకడు, తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోక మరొకడు, వ్యసనాలలో మునిగితేలిన ఇంకొకడు బ్రహ్మరాక్షసులుగా మారిన వృత్తాంతం అందులో కనిపిస్తుంది. వీరు ముగ్గురూ కూడా నదీస్నాన మహిమ వలన శాపవిముక్తులుగా మారినట్లు కార్తీక పురాణం పేర్కొంటోంది.
కారణాలు
ఇంచుమించు కార్తీకమాస సమయంలోనే సూర్యుడు తులారాశిలోకి చేరుకుంటాడు. ఇలా సూర్యుడు తులా సంక్రమణంలోకి ప్రవేశించగానే గంగానది అన్ని నదులలోనూ వ్యాపిస్తుందని చెబుతారు. అంటే ఏ నదిలో మునిగినా కూడా అది గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని అందిస్తుంది.
కార్తీకమాసంలో చలితీవ్రత పెరుగుతుంది. దీనిని శరీరం తట్టుకుని నిలబడాలంటే కాలానుగుణంగా దినచర్యను మార్చుకోవలసిందే! ప్రాతఃకాలంలో చేసే స్నానంతో శరీరం కఫసంబంధమైన దోషాలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటుంది.
స్నాన విధి
కార్తీకమాసములో సూర్యాస్తమయమునకు ముందే లేచి భగవంతుని నామస్మరణతో, అభ్యంగనం లేకుండా స్నానం చేయాలి. వీలున్నవారు ప్రతిరోజూ నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే ఎంతో ప్రశస్తం. బ్రాహ్మీ ముహుర్తాన (తెల్లవారు జామున నాలుగు గంటల సమయం) చన్నీటి స్నానం నిజమైన కార్తీక స్నానం.
‘‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు’’
అన్న శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. నదిలో స్నానం చేస్తున్నప్పుడు మూడు సార్లు మునిగి తరువాత గట్టు వద్దకు వచ్చి మన గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకున్న తరువాత ‘‘కార్తీక స్నానం కరిష్యే’’ అని చెప్పుకోవాలి. ఇంటివద్ద స్నానం చేసినా ఇదే విధంగా సంకల్పం చెప్పుకోవాలి. తడిబట్టలతో దీపం వెలిగించరాదు. పొడిబట్టలు కట్టుకుని దీపాలు వెలిగించి నీటిలో వదలాలి. తరువాత ఆ నదీమతల్లికి పసుపు, కుంకుమలు, హారతి సమర్పించాలి. తరువాత ఆ నది గట్టునే దీపం వెలిగించి ఒక సద్భ్రాహ్మణునికి దీపదానం కాని, తాంబూల దానం కాని స్తోమతకు తగినట్టు దక్షిణతో సహా సమర్పించి వారి ఆశీర్వాదం పొందాలి. ఈ విధంగా చేసే కార్తీక స్నానాలు సమస్త పాపనాశకాలు. సకల మలిన హరణాలు.