కార్తీకమాసం 2018: కార్తీకం ప్రాముఖ్యత, ఏ తిథి రోజున ఏం చేయాలి?

దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః 


అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే.  ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం.

  • కార్తీక శుద్ధ పాడ్యమి : తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

  • విదియ : సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

  • తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

  • చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.  పుట్టలో పాలు పోయాలి.

  • పంచమి : దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

  • షష్ఠి : ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

  • సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

  • అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

  • నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

  • దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

  • ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

  • ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

  • త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

  • చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

  • కార్తీక పూర్ణిమ : కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

  • కార్తీక బహుళ పాడ్యమి : ఆకుకూర దానం చేస్తే మంచిది.

  • విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

  • తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

  • చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

  • పంచమి :చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

  • షష్ఠి :గ్రామదేవతలకు పూజ చేయాలి.

  • సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

  • అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

  • నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

  • దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

  • ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

  • ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

  • త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

  • చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

  • అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.