క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ‌నివారం ఉద‌యం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజ‌మ‌న్నార్ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8 నుండి 10 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వ‌హిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

Source