స్వర్ణ గౌరీ వ్రతం: వినాయక చవితి ముందు రోజు స్వర్ణ గౌరీ వ్రతం

భారతదేశంలో అనేక ప్రాంతాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ  స్వర్ణ గౌరీ వ్రతం. ఈ పండుగ వినాయక చవితికి  ఒక రోజు ముందు జరుపుకుంటారు.

స్వర్ణ గౌరీ వ్రతం ఎందుకు చేస్తారు?


స్వర్ణ గౌరీ వ్రతాన్నే గౌరీ గణేష్ పూజ అని  గౌరీ ఉత్సవం లేదా గౌరీ హబ్బా  అనే పేర్లతో పిలుస్తారు. వివాహిత మహిళలు, కన్యలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని  నిర్వహిస్తారు. గౌరీ పండుగ భాద్రపద శుద్ధ తదియ రోజున జరుపుకుంటారు. తమ కోరికలు నెరవేరాలని గౌరీ పండుగ ను వివాహితలు చేస్తుంటారు.

వివాహిత మహిళలు తమ పసుపు కుంకాలు పదికాలాల పాటు చల్లగా ఉండాలని, తమ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే సంకల్పంతో ఈ పూజ చేస్తారు. కన్యలు తమకు అనుకూలమైన భర్త లభించాలని కోరుతూ ఈ గౌరీ పూజలు చేస్తుంటారు.

స్వర్ణ గౌరీ వ్రతం ఎలా చేయాలి?


స్వర్ణ గౌరీ వ్రతాన్నే గౌరీ పూజ అంటారు. ఈ పూజను వినాయక చవితి ముందురోజున నిర్వహిస్తారు. కనుక అంతకు ముందురోజే ఇంటిని శుభ్రం చేసుకుని, ఇంటికి మామిడి తోరణాలు అలంకరిస్తారు. ఆనవాయితీ ఉన్న వారు మార్కెట్ లో దొరికే గౌరీ ప్రతిమలను తెచ్చి ఉంచుకుంటారు. గౌరీ ప్రతిమతో పాటుగా గణేశ ప్రతిమను కూడా తెస్తారు.  అంటే వినాయక పూజకు ముందుగా వినాయకుని తల్లి అయిన గౌరీ దేవిని పూజిస్తారన్నమాట. రంగులతో అందంగా అలంకరించిన మట్టి గౌరీ ప్రతిమలు దొరుకుతాయి. పది కొత్త చేటలను, మంగళద్రవ్యాలను కూడా తెచ్చి సిద్ధంగా ఉంచుతారు.

వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి పూజా స్థలంలో ఒక మంటపం ఏర్పాటు చేసి, దానిపై రంగు రంగుల ముగ్గులు పెట్టి, దానిపైన కొత్త వస్త్రం పరిచి  దానిపై బియ్యం పోసి దానిపైన గౌరీ ప్రతిమను  ఏర్పాటు చేస్తారు. రకరకాల పువ్వులతోను, అరటి పిలకలతోను అందంగా అలంకరించిన వేదికపైన ప్రతిష్టించిన గౌరీ దేవిని షోడశోపచారాలతో, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొందరు గౌరీ ప్రతిమలకు బదులు కలశం పెట్టి పూజిస్తారు.

అమ్మవారి పూజలో భాగంగా ముందుగా సిద్ధం చేసుకున్న చేటలలో షోడశ ద్రవ్యాలను ఉంచి నలుగురు ముత్తయిదువలకు వాయినాలిస్తారు. మొదటి సంవత్సరం వాయినం అందుకోవడానికి ఇంటి ఆడపడుచులను తప్పనిసరిగా ఈ పూజకు ఆహ్వానిస్తారు. పూజ పూర్తయిన తరువాత ఆడపడుచును ఒక పీటపై కూర్చోపెట్టి ఒడిలో బియ్యం పోసి, ఇతర మంగళద్రవ్యాలతో పాటు వాయినం అందిస్తారు.

ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారిచేత కూడా పూజ చేయించి వారిచేత వేరే ఒక చిన్నపిల్లకు అలంకరణ సామాగ్రిని అందింపచేసి వారిని సంతోషపెడతారు.

 స్వర్ణ గౌరీ వ్రతం వాయినంలో ఏమేం ద్రవ్యాలు ఉంటాయి?


స్వర్ణ గౌరీ వ్రతం వాయినంలో షోడశ ద్రవ్యాలు ఉంటాయి. అంటే 16 రకాల ద్రవ్యాలన్నమాట. వాటిలో బియ్యం, రకరకాల పప్పులు, నల్ల  గాజులు, పసుపు, కుంకుమ భరిణలు, నల్లపూసలు, ముఖ్యంగా 16 మూరల పొడవున్న వత్తితో చేసిన యజ్ఞోపవీతం, 16 పత్తితో చేసిన వస్త్రాలు తప్పనిసరిగా ఉంటాయి. వీటితో పాటు పువ్వులు, జాకట్టుముక్క తదితర ద్రవ్యాలను ఆ చేటలలో పోసి మరో చేట మూత వేసి ఐదు వాయినాలు సిద్ధం చేస్తారు. వ్రతం ప్రారంభించిన మొదటి ఏడాది ఈ ఐదు వాయినాలు సిద్ధం చేసుకుని, ఒక వాయినాన్ని అమ్మవారికి సమర్పించి అది వ్రతం చేసుకున్నవారే ఉంచుకుంటారు. మరో వాయినాన్ని ఆడపడుచుకు, మిగిలిన వాటిని పెద్ద ముత్తయిదువలకు అందిస్తారు. స్తోమత ఉన్నవారు ఈ వాయినంలో చీరను కూడా అందచేస్తారు.

రెండవ ఏడాది నుంచి రెండేసి వాయినాలు సిద్ధం చేసి ఒక వాయినాన్ని తాము ఉంచుకుని, మిగిలిన వాయినాన్ని మరొకరికి వాయినంగా సమర్పిస్తారు. ఈ మధ్యకాలంలో చేటలకు బదులు వెదురుతో చేసిన బుట్టలు వినియోగిస్తున్నారు.

స్వర్ణ గౌరీ వ్రతంలో వినియోగించిన గౌరీ ప్రతిమను , వినాయక చవితి పూజ అనంతరం వినాయక విగ్రహంతోపాటు నిమజ్జనం చేస్తారు. అయితే ఈ వ్రతాన్ని ముఖ్యంగా కర్నాటక ప్రాంతంలో నిర్వహిస్తారు.