వరాహస్వామి సంచరించిన ప్రదేశమే తిరుమల కొండ
వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు . ఆదివరాహస్వామి గా , ప్రళయవరాహ స్వామి గా , యజ్ఞ వరాహస్వామి గా హిరణాక్షుడిని చంపి పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తెరుమలకొండ. తిరిమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది .
అయితే తిరుమలకొండ పై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే . తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపము . వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపం తో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు . శ్రీనివాసుడే .. శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆది వరాహస్వామి . వరాహస్వామిరూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు . మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే , ముక్కోటి దేవతలు మురిసిపోయారట .
ఆ శ్రీనివాసునికి స్థలమిచ్చినది వరాహస్వామి
నాకు ఈ ప్రదేశంలో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది . ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా .. అప్పుడు వరాహస్వామి తగిన మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు . అప్పుడు శ్రీనివాసుడు " నా దగ్గర ధనం లేదు , అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల ప్రధమ దర్శనము , ప్రధమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తానని " చెబుతాడు .
అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తారు . శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని వరాహస్వామి ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి . శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి , . శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నేటి భక్తులు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైనాడు . రెండు అవతాలతో , రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది.