శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
కాగా మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగాయి. రాత్రి 8 నుండి 10 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు.
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
Source