తిరుచానూరు ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు మంగ‌ళ‌వారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.

వైభవంగా చక్రస్నానం


మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్ళతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి పద్మపుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.

సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. రాత్రి రక్షాబంధనం, ఆచార్య, ఋత్విక్‌ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

Source