శ్రావణ అమావాస్య విశిష్టత ఏమిటి? ఏయే పూజలు చేయాలి?

శ్రావణమాసం అమావాస్య తిథినే పోలామావాస్య అంటారు. ఉభయగోదావరి జిల్లాలవాసులు దీనిని ‘పోలాల అమావాస్య’’ అని పిలుస్తారు. ఈ అమావాస్యకు గోదావరి నది పొర్లి పొర్లి వస్తుందని నానుడి. సెప్టెంబరు 9న పోలాల అమావాస్యను జరుపుకోబోతున్నాం. పోలామావాస్యనే పోలామా అని అంటారు. పోల అంటే కడుపునిండా మేత మేసి, నీరు తాగి పనీపాటు లేకుండా ఉన్న ఎద్దు అని అర్థం. అమా అంటే అమావాస్య. పోలామా అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్ధం.

శ్రావణ అమావాస్య పురాణకథ


అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు. వరగర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవినే కామించాడు. శివుడు భూలోకానికి వెళ్ళిన వేళను కనిపెట్టి అంధకాసురుడు పార్వతి దగ్గరకు వెళ్ళి తన దుష్టచింతను వ్యక్తంచేశాడు. అది చూసి వాకిట కాపలా కాసే నంది ఆ అసురునితో యుద్ధానికి తలపడ్డాడు. ఇంతలో శివుడు వచ్చి అంధకాసురుని హతమార్చాడు. ఈ సందర్భంలో నంది తనకు చేసిన సాయానికి మెచ్చి శివుడు అతనిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు నంది ఇలా కోరుకున్నాడు. ‘‘స్వామీ! మహర్షియైన శిలాధుని పొలంలో ఆదివృషభ రూపాన అతనికి నేను దొరికిన రోజు శ్రావణమాసం అమావాస్య తిథి. ఆనాడు వృషభపూజ చేసే భక్తుల కోరికలు నెరవేరునట్లు అనుగ్రహించండి’’ అన్నాడు. శివుడు ‘‘తథాస్తు’’ అన్నాడు. అప్పటినుంచి శ్రావణ అమావాస్య నాడు గో, వృషభ పూజ వాడుకైంది. ఈపూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా మాత్రమే చూస్తాం. అయితే ఇదే రోజున పోలాంబ వ్రతాచరణను ఎక్కువమంది చేస్తారు.

శ్రావణ అమావాస్య - పోలాంబ వ్రతం


పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానంలేనివారికి సంతానం ఇచ్చే దేవతగా ఉంది. పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని దేనినీ పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పసుపుకొమ్ము కట్టిన తోరాన్ని ఒక దానిని పోలకమ్మకు కడతారు. ఆ తోరాన్ని పిల్లల మెడల్లో కూడా కడతారు. ఆ పోలకమ్మ తోరాన్ని ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయం ఉండదని శాస్త్రవచనం. పోలకమ్మ తోరానికి ‘పోలేరమ్మ పుస్తి’ అనే పేరూ ఉంది.

శ్రావణ అమావాస్య- ఎద్దుపూజలు


మాళవదేశంలో ఈ పండుగను పోల పండుగ అంటారు. ఆ దేశంలో ఈనాడు పశుపూజ చేస్తారు. మట్టితో ఎద్దు బొమ్మలు చేస్తారు. వాటికి సుద్దరాయి పూస్తారు, ఇతర అలంకారాలు చేస్తారు. అప్పుడు వానిని ఒక పీటమీద ఉంచి మామూలుగా పూజచేస్తారు. ఆనాటి ఆహారంలో భాపర పోళీ అనే వంటకం ముఖ్యంగా ఉంటుంది. వాటిని మెత్తటి పిండితో చేస్తారు. నడుమ నడుమ చిల్లులు ఉంటాయి. ఆవిరి మీద వండుతారు. తినేటప్పుడు వాటిని పంచదార కలిపిన పాలల్లో ముంచుకుంటారు. సాయంకాలం మునిమాపు వేళ బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ ఇస్తారు. పూజానంతరం కొన్ని పచ్చి బియ్యపు గింజలు ఎద్దులమీద చల్లుతూ సంతోషపూర్వకంగా మల్ళీ సంవత్సరం రావాల్సిందిగా ఎద్దులను కోరతారు. ఈ తంతు అంతా స్త్రీలే చేస్తారు. పశువుల పండుగకు ఇది రూపాంతరంగా చెప్పవచ్చు. ఈ పండుగ ప్రధాన ఉద్దేశ్యం పశువుల్ని గౌరవించడానికి పశువుల క్షేమాన్ని కోరడానికి చేస్తారు.

శ్రావణ అమావాస్య - పిఠోరి వ్రతం


శ్రావణ అమావాస్య ను మహారాష్ట్రలో పిఠోరి వ్రతమని చేస్తారు. పొద్దున్నే స్నానము చేసి బొమ్మల పూజ శివుని ఉద్దేశించి చేస్తారు. గోడమీద, కాగితములమీద, నేలమీద దేవతల బొమ్మలు, ఇంటిలో ఉన్న వస్తువుల బొమ్మలు, మంచము, బల్ల, పాత్రలు, ఇల్లు, ఆవులు, గేదెలు, గుర్రములు, వీటి బొమ్మలు గీయించవలెను. వానికి పూజ నియమముతో అయిదేండ్లు పూజ చేసి ఉద్వాసన చేయవలెను. ఇలా ఆచరించినట్లయితే సమస్త వస్తు సమృద్ధి కలుగుతుందని వీరి నమ్మకం. దీనిని కౌశ్యమావాస్య అని, ఆలోకమావాస్య అనీ కొన్ని చోట్ల సప్తపూరికామావాస్య అని అంటారు.