తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం శనివారం ఉదయం 6.00 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని జూలై 25వ తేదీ వరకు, తిరిగి జూలై 29 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని విమాన వేంకటేశ్వరస్వామివారికి ఎదురుగా 11 మంది వేద పండితులు సకల శాస్త్రాములను పారాయణం చేశారు. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలను పారాయణం చేశారు. శ్రీవారి సన్నిధిలో న్యాయసుధా పారాయణం చేయడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, అనేక సంవత్సరాలుగా టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉడిపిలోని శ్రీ కృష్ణస్వామివారి సన్నిధిలోను న్యాయసుధా పారాయణం నిర్వహిస్తున్నారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది.